అంతర్‌ రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల అరెస్ట్‌

23 Feb, 2019 09:32 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రంగనాథ్‌ స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్‌ 

త్రిపురారం (నాగార్జునసాగర్‌) : ఏడాది కాలంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా ట్రాక్టర్‌ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కారు. శుక్రవారం హాలియా సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంగనాథ్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండల పరిధిలోని అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజి వెంకట కృష్ణ, బత్తుల హన్మంతరావు, బత్తుల గోపరాజు జల్సాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బులు సంపాధించాలని ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు.

ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఎక్కడైతే దొంగతనం చేయాలనుకుంటారో అక్కడ ముందుగా ముగ్గురు రెక్కి నిర్వహిస్తారు. ఆ తరువాత ఇద్దరు నేరస్తులు ఒక మోటర్‌ బైక్‌పై, మరో నేరస్తుడు ట్రాక్టర్‌ ఇంజన్‌తో వచ్చి ఇళ్ల ముందు పార్కింగ్‌ చేసిన ట్రాక్టర్లను చూసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో ట్రాక్టర్‌ ట్రాలీలు ఉంటే నేరస్తులు తమ వెంట తీసుకవచ్చిన ట్రాక్టర్‌కి తగిలించుకొని తీసుకొని పోవడం, ట్రాక్టర్‌ ఇంజన్‌ ఉంటే దానిని తీసుకుని పోవడంలాంటి దొంగతనాలకు పాల్పడి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దొంగిలించిన ట్రాక్టర్‌ ఇంజన్లు, ట్రాలీలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 చోట్ల, ఇతర జిల్లాలో 5 చోట్ల ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలకు పాల్పడ్డారు.

24 చోట్ల కేసులు ..
అంతర్‌రాష్ట్ర ట్రాక్టర్‌ నేరస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 24 చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలను చోరీ చేయడంతో పలు పోలీస్‌స్టేషన్లలో నేరస్తులపై కేసులు నమోదైయ్యాయి. 2017 నవంబర్‌లో నేరేడుచర్ల పీఎస్, 2018 జూన్‌లో వేములపల్లి పీఎస్, 2018 జులైలో నిడమనూరు పీఎస్, కోదాడ టౌన్‌ పీఎస్‌లో, అదే విధంగా పద్నాలుగు రోజుల వ్యవధిలో కోదాడ టౌన్‌ పీఎస్‌లో మరో కేసు, 2018 ఆగస్టులో వట్సావై పీఎస్‌లో, 2019లో అనంతగిరి పీఎస్‌లో,  2018 సెప్టెంబర్‌లో కోదాడ టౌన్‌ పీఎస్‌లో, 2018 అక్టోబర్‌లో వేములపల్లి పీఎస్‌లో, 2018 నవంబర్‌లో తిప్పర్తి పీఎస్‌లో, అదే విధంగా మరో వారం రోజుల వ్యవధిలో అదే పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్‌ చోరీ జరిగినట్లు మరో కేసు నమోదు అయ్యింది.

2018లో కోదాడ టౌన్‌ పీఎస్‌లో ట్రాక్టర్‌ చోరీ జరిగినట్లు కేసు నమోదు అయ్యింది. 2018 డిసెంబర్‌లో హాలియా పీఎస్‌లో, 2019లో గురజాల పీఎస్‌లో, 2018, 2019లో త్రిపురారం పీఎస్‌లో రెండు కేసులు నమోదు కాగా, 2019లో నిడమనూరు పీఎస్‌లో, 2019లో కుసుమంచి పీఎస్‌లో, మరో మూడు రోజుల వ్యవధిలోనే అదే పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. 2019లో గరిడేపల్లి పీఎస్‌లో, 2019 ఫిబ్రవరి 14వ తేదీ, 15వ తేదీల్లో హాలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాక్టర్లు చోరీ జరిగినట్లు కేసులు నమోదు అయ్యియి. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 కేసులు, ఇతర జిల్లాలో 5 కేసులు నేరస్తులపై కేసులు నమోదు చేశారు.

పట్టుబడింది ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలు దొంగతనాలు జరగడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీ ఎస్సీ, హాలియా సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు పోలీసుల బృం దాలను నియమించారు. ఈ నిఘా విభాగం నేర పరిశోధనపై దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 21న కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డులో గల అహ్మద్‌ ఇంజనీరింగ్‌ వర్క్‌ షాపు వద్ద అనుమానాస్పందంగా ఉన్న నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు.

వారిని పోలీసులు విచారించగా తాము చేసిన నేరాలను ఒప్పుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరస్తుల నుంచి  8లక్షల 90వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్, 7 ట్రాక్టర్‌ ఇంజన్లు, 17 ట్రాక్టర్‌ ట్రాలీలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 61లక్షల 90 వేలు ఉంటుందన్నారు. అంతరాష్ట్ర నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ధను ంజగౌడ్, హాలియా, నిడమనూరు, త్రిపురారం ఎస్‌ఐలు సతీష్‌కుమార్, యాదయ్య, ఆరీఫ్, పీసీలు విజయశేఖర్, మాదాసు రామారా వు, హోంగార్డు వెంకట్రాంరెడ్డి, శేఖర్, గంగాధర్, మున్యా, నర్సిరెడ్డి, సైదులు జిల్లా ఎస్సీ అభినందించి సీఐ ధనుంజయ్‌గౌడ్‌తో పాటు పోలీస్‌ సిబ్బందికి రూ. 10 వేల నగదు రివార్డును అందజేశారు.

మరిన్ని వార్తలు