అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

11 Sep, 2018 10:26 IST|Sakshi
చోరీ వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శ్వేత

బాన్సువాడ (నిజామాబాద్‌): నిత్యం వందలాది లారీలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి 161పై (సంగారెడ్డి– నాందేడ్‌–అకోల) ఓ లారీని హైజాక్‌ చేసి, దారి మళ్లించి, డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి లారీ ఎత్తుకెళ్లిన అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేవలం 10 రోజుల్లోపే ముఠాను చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. చోరీ వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత సోమవారం బాన్సువాడ రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గత నెల 29న నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు పాడైన బ్యాటరీల లోడ్‌తో 161 జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ (ఏపీ–12యూ 4754) ని, అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా స్కార్పియో(ఎంహెచ్‌ 26/వి–5849)లో నాందేడ్‌ నుంచి వెంబడించింది. ఆ రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో లారీని కామారెడ్డి–సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో బ్రాహ్మణపల్లి హనుమాన్‌ మందిరం వద్ద అడ్డుకున్నారు.

లారీ డ్రైవింగ్‌ చేస్తున్న మహ్మద్‌ సాబెర్‌ ఖాన్‌ను తీవ్రంగా చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు. లారీని దారి మళ్లించిన దొంగలు, జాతీయ రహదారి నుంచి నారాయణఖేడ్‌ రోడ్డు వైపు తీసుకెళ్లి, జహీరాబాద్‌ సమీపంలో రాయిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను నిమ్మ చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదారు. అతని వద్ద ఉన్న 30వేల నగదును, రూ. 9లక్షల విలువ చేసే బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. అనంతరం లారీని బోధన్‌ సమీపంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి, లారీలో ఉన్న బ్యాటరీల లోడ్‌ను రహస్య గోడౌన్‌లో డంప్‌ చేసి, లారీని తీసుకెళ్లి ధర్మాబాద్‌లో వదిలేశారు. లారీ హైజాక్‌ కావడంతో బాధితుడు లారీ డ్రైవర్‌ మహ్మద్‌ సాబెర్‌ ఖాన్‌ నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ధర్మాబాద్‌ నుంచి లారీని రికవరీ చేయడంతో పాటు, సెల్‌ఫోన్‌ లొకేషన్ల ద్వారా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు.

దొంగల ముఠాలోని ఆరుగురు సభ్యులైన నాందేడ్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్‌ ఖురేషి, షేక్‌ అవేస్, షేక్‌ సమీర్, ఎండీ సలీమ్‌లు, నిజామాబాద్‌ నగరంలోని అహ్మద్‌పుర కాలనీకి చెందిన అన్వర్‌ ఖాన్, శేక్‌ రఫీఖ్‌లను నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావు పల్లి చౌరస్తా వద్ద ఈనెల 9న పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 9 లక్షల చోరీ సొమ్మును రికవరీ చేశారు. దొంగల ముఠాలో ఉన్న మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఈ సభ్యులపై నవీపేట, వర్ని, ముధోల్, దిలావర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. కాగా కేవలం 10 రోజుల్లోపే దొంగలను పట్టుకున్న సీసీఎస్‌ పోలీసు బృందమైన శంకర్, ఉస్మాన్, నరేశ్, రవికృష్ణ, రాంలను ఎస్పీ శ్వేత అభినందించారు. వీరికి క్యాష్‌ రివార్డులను అందజేశారు. సమావేశంలో రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు