పైసల కోసం పరీక్ష రాస్తూ..

2 Mar, 2019 09:35 IST|Sakshi

రూ. 2 వేలతో ఒప్పందం

ఒకరికి బదులుగా మరొకరు హాజరు

విద్యార్థితో పాటు యువకుడి అరెస్ట్‌

చంచల్‌గూడ: పైసల కోసం ఇంటర్‌ విద్యార్థి బదులుగా పరీక్ష రాస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన శుక్రవారం సైదాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సురేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పురాకు చెందిన సయ్యద్‌ నయీం ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌మీడియేట్‌ చదువుతూ అదే ప్రాంతంలోని స్టూడెంట్‌ పాయింట్‌ కోచింగ్‌ సెంటర్‌లో ట్యూషన్‌కు వెళ్లేవాడు.

కోచింగ్‌ సెంటర్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న ఖాలేద్‌ రెయిన్‌ బజార్‌కు చెందిన తన స్నేహితుడు మహ్మద్‌ సోహేల్‌  నయీంకు పరిచయం చేశాడు. సోహేల్‌కు బదులుగా నయీం పరీక్ష రాసేందుకు గాను ఇద్దరి మధ్య రూ. 2 వేలకు ఒప్పందం కుదిర్చాడు. ఇందులో భాగంగా శుక్రవారం  ఐఎస్‌ సదన్‌లోని గోకుల్‌ కాలేజీ పరీక్షా కేంద్రంలో సోహెల్‌ బదులుగా మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష రాస్తున్న నయీం వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్‌ హాల్‌ టికెట్‌ పరిశీలించగా, అందులో మరో విద్యార్థి ఫొటో ఉండటంతో స్క్వాడ్‌కు సమాచారం అందించింది. కాలేజీ ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు నయీంతో పాటు సోహేల్‌ను అరెస్టు చేసిన సైదాబాద్‌ పోలీసులు రిమాండ్‌ తరలించారు.

మరిన్ని వార్తలు