కూరగాయల కత్తితో గొంతు కోసి.. ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

11 Feb, 2020 02:25 IST|Sakshi

కరీంనగర్‌ నడిబొడ్డున ఘాతుకం 

గతంలో వీరింట్లో అద్దెకు ఉన్న ఓ యువకుడి పనే!  

ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు

ఇరువురూ స్నేహంగా మెలిగేవారని అనుమానం! 

24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామన్న సీపీ కమలాసన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని గుర్తుతెలియని ఆగంతకుడు గొంతుకోసి హతమార్చాడు. గతంలో స్నేహంగా మెలిగిన యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కరీంనగర్‌లోని విద్యానగర్‌ పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వెనుక భాగంలో నివసించే ముత్త కొమురయ్య–ఓదెమ్మ దంపతులకు కూతురు రాధిక(19), కుమారుడు వేణు ఉన్నారు. వేణు హైదరాబాద్‌లో ఎంసీఏ చదువుతుండగా, రాధిక కరీంనగర్‌లోని సహస్ర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఓదెమ్మ భవన నిర్మాణ కూలీగా, కొమురయ్య గోడౌన్‌లో కూలీగా పనిచేస్తున్నారు. రోజు లాగే తల్లిదండ్రులు ఇద్దరు సోమవారం ఉదయం కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో రాధిక చదువుకుంటోంది. ఈ సమయంలో ఆగంతకుడు ఇంటికి వచ్చి కూరగాయల కత్తితోనే విద్యార్థిని గొంతుకోసి పరారయ్యాడు.

బాలుడు చూసి చెప్పడంతో.. 
వీరి ఇంటి ముందు నివసించే ఓ తొమ్మిదేళ్ల బాలుడు మనోజ్‌ సోమవారం సాయంత్రం 5 గంటల సమ యంలో ఆడుకొనేందుకు రాధిక ఇంటికి రాగా, ఆమె అప్పటికే రక్తపు మడుగులో పడిఉంది. భయపడిన మనోజ్‌ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు. అప్పటికే రాధిక మృతి చెందడంతో పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ‘పోలియో బారిన పడ్డ కూతురికి లక్షల రూపాయలతో చికిత్స చేయించి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాం. నా బిడ్డను ఎవడు ఎందుకు చంపాడో తెలియదు’అని రాధిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసిన వెంటనే అదనపు డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్‌ సంఘటనా స్థలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. రాధికను హతమార్చిన ఆగంతకుడు ఆధారాలు లేకుండా రక్తపు మరకలను తుడిచివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులు రాధిక నివాసంలో తనిఖీలు చేశారు. పోలీసు జాగిలాలు కి.మీ. దూరం వరకు వెళ్లి ఆగిపోయాయి. 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

తెలిసినవారి పనే! 
రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి చుట్టూ కాంపౌండ్‌ గోడ ఉండటం, కొత్త వారు ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పాత పరిచయంతోనే..  ఆ యువకుడు తన కూతురితో స్నేహంగా ఉండటం నచ్చకపోవడంతో రాధిక తల్లిదండ్రులు అతడిని ఇల్లు ఖాళీ చేయించారు. పాత పరిచయంతో ఆ యువకుడు తరచూ రాధికతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పాత పరిచయంతోనే సోమవారం ఆ యువకుడే ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. రాధిక కాల్‌డేటా, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ యువకుడే హత్య చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరింత స్పష్టత కోసం సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా, ఇది తెలిసిన వారి పనేనని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ బీవీ.కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పరామర్శించిన మంత్రి గంగుల 
రాధిక హత్య విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్‌ను ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాధిక కుటుంబానికి రూ.25 వేలు తక్షణ సాయంగా అందజేశారు.

మరిన్ని వార్తలు