ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

1 Nov, 2017 12:28 IST|Sakshi
అంజలి (ఫైల్‌)

అచ్చంపేట రూరల్‌: ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అచ్చంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అనుదీప్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని జూబ్లీనగర్‌ కాలనీకి చెందిన కటిక ఖాజ, కమల దంపతుల కుమార్తె పట్టణంలోని ప్రగతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేస్తున్న అంజలి అరుపులను విని స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే 90 శాతం కాలిపోయింది. స్థానికులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందడంతో అచ్చంపేట ఆస్పత్రికి తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారని, విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ అనుదీప్‌ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియలేదని, అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని వేపూరిగేరిలో నరేష్‌కుమార్‌(21) అనే యువకుడు అద్దెకు ఉన్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామానికి చెందిన నరేష్‌కుమార్‌ గత కొన్ని రోజుల నుంచి పట్టణంలోని క్లాక్‌టవర్‌ సమీపంలో ఉన్న సీమ్‌కో బేకరీలో పనిచేస్తున్నాడు. అయితే నరేష్‌కుమార్‌ ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య ప్రేమవ్యవహారం కొన్ని రోజులు సక్రమంగా నడిచిన ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నరేష్‌కుమార్‌ తల్లి బాలీశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

మరిన్ని వార్తలు