ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

26 Mar, 2018 12:34 IST|Sakshi
మృతి చెందిన వినయ్‌,బోరున విలపిస్తున్న మృతుడి తల్లి కుమారి

జూపాడుబంగ్లా: మండలంలోని 80బన్నూరులో ఇంటర్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కుమారి, వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండోవాడు కుమారుడు వినయ్‌(17) నందికొట్కూరులోని ఓప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఇంటివద్దే ఉంటున్నాడు. అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి కల్లంలోని చింతచెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు సమాచారం అందించారు.

చేతికొచ్చిన కుమారుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వినయ్‌ జేజమ్మ సాయమ్మ సృహతప్పిపడిపోయింది. ఇదిలా ఉండగా వినయ్‌ తాటిపాడుకు చెందిన తోటి విద్యార్థినితో ప్రేమలో పడినట్లు సమాచారం. విషయం తెలుసుకొన్న అమ్మాయి అన్న వినయ్‌ అన్నకు చెప్పినట్లు తెలిసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో తనను ఎక్కడ మందలిస్తారోనని భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. విషయం తెలుసుకొన్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మినారాయణ తెలిపారు. 

మరిన్ని వార్తలు