ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

3 Oct, 2019 10:23 IST|Sakshi
హాస్టల్‌ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు

సాక్షి, తిరువూరు(కృష్ణా) : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భూక్యా స్వప్న (17) బుధవారం ఉదయం కళాశాల హాస్టలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంపలగూడెం మండలం వినగడపకు చెందిన ఆటో డ్రైవర్‌ భూక్యా వాల్యా కుమార్తె స్వప్న ఉదయం తోటి విద్యార్థినులు స్టడీ అవర్‌కు వెళ్తుండగా తనకు అనారోగ్యంగా ఉందని హాస్టల్లోనే ఉంది. అయితే, స్వప్న గది తలుపులు తీయకపోవడంతో హాస్టలు వార్డెను, వాచ్‌మెన్‌ కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కొందరు యువకుల సహకారంతో స్వప్న మృతదేహాన్ని కిందకు దింపిన వార్డెన్‌ కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. తమ కుమార్తె మరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హాస్టలుపై దాడి చేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు.


విద్యార్థిని స్వప్న మృతదేహం

విద్యార్థి సంఘాలు సైతం స్వప్న మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హాస్టలు ఎదుట ధర్నా చేశారు. మైలవరం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి కళాశాల యాజమాన్యంతో, విద్యార్థి సంఘాలతో, మృతురాలి తల్లిదండ్రులతో చర్చించారు. స్వప్నను ఓ అధ్యాపకుడు కళాశాల తరగతి గదిలో మందలించిన కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల ఎదుట ఆరోపించారు. అయితే, పోలీసు స్టేషన్‌లో కళాశాల యాజమాన్యానికి, విద్యార్థిని తల్లిదండ్రులకు రాజీ కుదిర్చిన పోలీసులు.. స్వప్న కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్‌–1 ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, గంపలగూడెం ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు