ఆశల దీపం ఆరిపోయింది

3 Dec, 2018 08:08 IST|Sakshi
తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలో మురళీకృష్ణ చంటి (ఫైల్‌ఫొటో)

ఆటో బోల్తాపడి ఇంటర్‌ విద్యార్థి మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నవగాం సమీపంలో ఘటన

తాము పడుతున్న కష్టాలను కుమారుడు పడకూడదని భావించి రెక్కలుముక్కలు చేసుకుని చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరకు పుత్రశోకమే మిగిలింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందాడనే పిడుగులాంటి వార్త వినాల్సి రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన పాలకొండ మండలం నవగాం చెరువు మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది.  

శ్రీకాకుళం, పాలకొండ/కొత్తూరు:  కొత్తూరు మండలం కుంటిబద్ర కాలనీకి చెందిన కానుగ జగన్నాథం, యశోద దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో సంతానమైన కానుగ చంటి(17) చదువులో చురుకైన వాడు కావడంతో పాలకొండలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియెట్‌ బైపీసీ సెకెండియర్‌ చదివిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో తల్లిదండ్రులిద్దరూ కూలీలుగా మారి చెన్నై వలస వెళ్లారు.

తీరని విషాదం..
చంటి తన తల్లిదండ్రులతో దాదాపు ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లికి ఫోన్‌ చేసి సంక్రాంతికి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలని కోరాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో పాలకొండ మండలంలోని పొట్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. నవగాం చెరువు వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తాపడి పొలాల్లోకి పడిపోయింది. ఈ ఘటనలో చంటి రోడ్డుపైకి తుల్లిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న ఎం.సింగుపురం గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ(65), పొట్లి గ్రామానికి చెందిన ఎం.మురళీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజాం కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చంటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లడిల్లిన తల్లిదండ్రులు..
కుమారుడి మరణ వార్త విని చంటి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. సంక్రాంతి పండగకి రావాలని కోరిన కుమారుడు తమని ఇలా రప్పిస్తున్నాడంటూ కన్నీమున్నీరుగా రోదిస్తున్నారు. 

మరిన్ని వార్తలు