తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

15 Jun, 2020 11:22 IST|Sakshi
ప్రసన్న (ఫైల్‌)

కుమార్తె మృతితో కుటుంబంలో విషాదఛాయలు  

కొత్తపల్లె (పామూరు): తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్‌ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్‌ చదివిస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌తో ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా పంచలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై అంబటి చంద్రశేఖర్, ఏఎస్సై డి.లక్ష్మీప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. 

బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తుదనుకుంటే..
‘మాకష్టం మాపిల్లలకు ఉండకూడదని కష్టపడి పిల్లలను చదివిస్తున్నాం. చదువుకుని మంచి ఉద్యోగస్తురాలవుతుందనుకున్న మా కుమార్తె ఇలా మాకు దూరమవుతుందనుకోలేదు. కష్టపడి చదివితే ఉద్యోగమొస్తుందనే టీవీ ఎక్కువగా చూడద్దని చెప్పా. కానీ ఇలా మమ్ములను మా కుమార్తె విడిచి శాశ్వతంగా దూరమవుతుందనుకోలేదని’ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది.

విద్యార్థిని ఆత్మహత్య
మద్దిపాడు: ఇంటర్‌ పరీక్షలు ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లవరం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...మల్లవరం ఎస్‌సీ కాలనీకి చెందిన బోడిపాక కీర్తి అద్దంకిలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుకుంది. రెండు రోజుల క్రితం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు ఒక్కటే కుమార్తె, ముగ్గురు కుమారులు కావడంతో  ఇంటి మహాలక్ష్మి మరణించిందంటూ  విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు