కలెక్టర్‌ అవుతావనుకుంటినే..

21 Oct, 2018 07:49 IST|Sakshi
మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌) శివరాజ్‌కుమార్‌ (ఫైల్‌) కొడుకు మృతితో రోదించి సొమ్మసిల్లిపడిపోయిన వరలక్ష్మీ

అమ్మా... మీ కష్టం వృథా కానివ్వను... కష్టపడి సివిల్స్‌ చదివి కలెక్టర్‌ అవుతా. మీ ఆశయాన్ని నెరవేరుస్తా అని చెప్పి మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా? నాన్నా’ అంటూ శివరాజ్‌కమార్‌ (19) తల్లి వరలక్ష్మీ గుండెలవిసెలా రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘దేవుడా ఎంత పని చేశావయ్యా! చెట్టంత కొడుకును తీసుకెళ్లి ఈ తల్లికి కడుపుకోత మిగిల్చావా? మేం ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.  

కణేకల్లు (అనంతపురం): కణేకల్లులోని శ్రీ సిద్ధప్ప దేవాలయ సమీపాన నివాసముంటున్న మంగలి రామాంజినేయులు, వరలక్ష్మీ దంపతుల కుమారుడు శివరాజ్‌కుమార్‌ (19) హైదరాబాద్‌లోని షైన్‌ ఇండియా ఐఏఎస్‌ అకాడమీలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. దసరా పండుగకు సెలవులివ్వడంతో స్వగ్రామానికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు హెచ్చెల్సీకి వెళ్లాడు. చాలాసేపు ఈతకొట్టి సరదాగా గడిపాడు. చివరగా మరోసారి ఈత కొడదామని అందరూ నీళ్లలోకి దూకారు. అప్పటికే బాగా అలసిపోయిన శివరాజ్‌కుమార్‌ నీటి ఉధృతికి తట్టుకోలేకపోయాడు. నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హెచ్చెల్సీ వెంబడి రెండు రోజులపాటు గాలించినా జాడ కనిపించలేదు. ఎట్టకేలకు శనివారం ఉదయం బొమ్మనహాళ్‌ మండలం వన్నళ్లి వద్ద శవమై తేలాడు.

లక్ష్యం చేరుకోక మునుపే తిరిగిరాని లోకాలకు.. 
కాలువలో లభించిన శవాన్ని కుటుంబ సభ్యులు నేరుగా కణేకల్లు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తీసుకొచ్చారు. ఎప్పుడూ నవ్వుతూ కన్పించే శివరాజ్‌కుమార్‌ విగతజీవిగా కన్పించడంతో తల్లి భరించలేకపోయింది. భవిష్యత్తులో అండగా ఉంటానన్న కొడుకే లేకపోతే ఈ జీవితం తనకెందుకని, దేవుడా ఎందుకింత పెద్ద శిక్ష వేశావయ్యా అంటూ సొమ్మసిల్లిపడిపోయింది. ‘నాన్నా... నాకు సివిల్స్‌ అంటే ఇష్టం... హైద్రాబాద్‌లో ఐఏఎస్‌ అకాడమీలో చదువుకుంటానని చెబితే.. ‘సరే నాన్న చదువుకో అన్నానే.

నీ లక్ష్యం నెరవేరకనే అందరినీ వీడి ఎలా వెళ్లిపోయావు కుమార్‌’ అంటూ రోదిస్తున్న తండ్రిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శివరాజ్‌కుమార్‌ మృతితో కణేకల్లులో విషాదఛాయలు అలుముకొన్నాయి. నాయిబ్రహ్మణులుందరూ దగ్గరుండి పోస్టుమార్టం చేయించి అంత్యక్రియలు నిర్వహించారు. శివరాజ్‌కుమార్‌ మరణవార్త తెలుసుకుని ఐఏఎస్‌ అకాడమీలో చదువుతున్న అతని స్నేహితులు 20 మంది కణేకల్లుకు హుటాహూటిన వచ్చారు. పండుగకు వెళ్లి వస్తానని చెప్పి తమ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవడం బాధగా ఉందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కణేకల్లు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేశారు. 

కొడుకు లక్ష్యం కోసం శ్రమించిన తండ్రి
పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న మంగళి రామాంజినేయులు కుల వృత్తి చేసుకుంటూ భార్యా, పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు అంకిత తొమ్మిదవ తరగతి చదువుతోంది. హిందూపురం సమీపంలో కొడిగెనహళ్లి ఏపీ రెసిడెన్షియల్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసుకున్న కుమారుడు శివరాజ్‌కుమార్‌ తన జీవిత లక్ష్యం కలెక్టర్‌ అని, తనను హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ అకాడమీలో చదివించాలని కోరడంతో తండ్రి సరేనన్నాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పిల్లల చదువు కోసం రామాంజినేయులు నిరంతరం కష్టపడ్డాడు.

షైన్‌ ఇండియా ఐఏఎస్‌ అకాడమీలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న శివరాజ్‌కుమార్‌ దసరా పండుగ కోసం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి సరదా కోసం వెళ్లిన శివకుమార్‌ అనంత లోకాలకు వెళ్లి పోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు  తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. చదువులో తనకు ఇన్‌స్పిరేషన్‌గా ఉన్న అన్న అకస్మాత్తుగా మృతి చెందడంతో అంకిత బోరున విలపిస్తోంది. 

మరిన్ని వార్తలు