పబ్‌జీ ఎఫెక్ట్‌.. ఇంటర్‌ విద్యార్థి కిడ్నాప్‌ డ్రామా

13 Oct, 2019 08:04 IST|Sakshi

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌) : పబ్‌ జీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పబ్‌జీ వద్దన్నందుకు నీ కొడుకును కిడ్నాప్‌ చేశారని తల్లికే ఓ ఇంటర్‌ విద్యార్థి ఫోన్‌ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే సమీర్‌ ఆర్మన్‌(16) నార్సింగిలోని జాహ్నవి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో షేక్‌పేట్‌లోని ఆకాశ్‌లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు చేస్తున్నాడు.  తండ్రి అల్తఫ్‌ ఆస్ట్రేలియాలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కొంత కాలంగా సమీర్‌ పబ్‌ జీ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేశాడు. గమనించిన తల్లి పబ్‌జీ ఆడవద్దని మందలించి సెల్‌ఫోన్‌ తీసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సమీర్‌ మణికొండలోని స్నేహితుడు సిద్ధార్థ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు.

బ్యాంక్‌లో రెండు వేల నగదు తీసుకొని రాత్రి 9.30 ఇమ్లీబన్‌ బస్‌ స్టేషన్‌ నుంచి బస్సులో ముంబై బయటుదేరాడు. తెల్లవారు జామున 5.30 గంటలకు షోలాపూర్‌లో దిగి బాత్‌ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు బస్సు వెళ్లిపోయింది. ఏమి చేయాలో పాలుపోక అక్కడున్న వారి సెల్‌ ఫోన్‌ తీసుకొని ఉదయం 7 గంటలకు తల్లికి ఫోన్‌ చేశాడు. నీ కొడుకును కిడ్నాప్‌ చేశాం, నీ కొడుకు అంటే నీకు ప్రేమ లేదా అర్జంట్‌గా మూడు లక్షల రూపాయలు పంపాలని, ఈ ఫోన్‌ నంబర్‌కు మళ్లీ మళ్లీ పోన్‌ చేయవద్దని  చెప్పాడు. ఆమె పెద్దగా స్పందించలేదు. శనివారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి బస్సులో మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌కు వచ్చాడు. సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో తల్లి ఆశా చూసి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించింది. మాచెర్లకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చున్న సమీర్‌ను రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి తల్లి ఆశకు సమీర్‌ను అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా