ప్రాణం మీదకు తెచ్చిన ‘చాక్లెట్‌ గొడవ’

18 Feb, 2020 02:18 IST|Sakshi

వనస్థలిపురం డీమార్ట్‌లో ఘటన

కేసు నమోదు.. పోస్టుమార్టం నివేదిక వస్తే తెలియనున్న కారణం

హస్తినాపురం: నోరూరించే చాక్లెట్‌ ఓ ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. డీమార్ట్‌లో చాక్లెట్‌ తీసుకొని డబ్బులు చెల్లించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడగడంతో ఆదివారం సాయంత్రం షాపింగ్‌ వచ్చిన సతీష్‌ (18) భయంతో కుప్పకూలాడని ఆ సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్‌నగర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యా?.. లేక ఆకస్మిక మరణమా అనేది తేలనుంది. డీమార్ట్‌లో షాపింగ్‌ చేసి బయటకు వచ్చేంత వరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, బయటకొచ్చాక అతడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీమార్ట్‌ ఎంట్రెన్స్‌కు 40 మీటర్ల దూరంలో పడిపోయిన సతీష్‌ను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సందర్శించారు. 

అసలేం జరిగిందంటే..: సూర్యాపేట జిల్లా జగ్గు తండాకు చెందిన లౌడ్య బాలాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్‌(18) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతూ అదే హాస్టల్‌లో ఉంటున్నాడు. 10 మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఔటింగ్‌కు వెళ్లారు. సతీష్‌ తన ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 8.10కి వనస్థలిపురం డీమార్ట్‌లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్‌ డైరీ మిల్క్‌ చాక్లెట్‌ జేబులో వేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే ఎగ్జిట్‌ గేట్‌ దాటి బయటకు వచ్చిన సతీష్‌ను సెక్యూరిటీ సిబ్బం ది పిలవడంతో చాక్లెట్‌ను జేబులో నుంచి కిందపడేశాడు. అప్పటికే చెమటలు పట్టిన సతీష్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారి పోయారు.

మరణవార్త తెలుసుకొని వచ్చిన సతీష్‌ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వి ద్యార్థి సతీష్‌ను బంధువుల అనుమతితోనే ఔటింగ్‌కు పం పామని కళాశాల ప్రిన్సిపల్‌ స్నేహలత తెలిపారు. ఇంటర్‌ విద్యార్థిని దొంగతనం నెపంతో కొట్టి హతమార్చిన డీమా ర్ట్‌ యాజమాన్యంపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని లంబాడ ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఆ సంస్థ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. డీమార్ట్‌ను మూసివేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు