విద్యార్థి అనుమానాస్పద మృతి

17 Feb, 2019 13:18 IST|Sakshi
మృతుడు పవన్‌ కల్యాణ్, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లి రంగమ్మ

కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

 గుత్తి: త్వరలో పరీక్షలు రాయాల్సిన ఇంటర్‌ విద్యార్థి తరగతి గదిలోనే అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. యాజమాన్యమే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన చాకలి రామచంద్ర, చాకలి రంగమ్మ దంపతుల చిన్న కుమారుడు పవన్‌కల్యాణ్‌ (16) గుత్తిలోని శ్రీ మహాత్మా జూనియర్‌ కాలేజీలోఫస్టియర్‌ బైపీసీ చదువుతున్నాడు. కాలేజీ అనుబంధ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. శనివారం ఉదయం ఆరు గంటలకు పిల్లలు నిద్ర లేచారా, లేదా అని పరిశీలించేందుకు వెళ్లిన కరస్పాండెంట్‌ ధనుంజయరెడ్డికి తరగతి గదిలో ఉరికి వేలాడుతున్న పవన్‌ కల్యాణ్‌ కనిపించాడు. వెంటనే కిందకు దింపి ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే..అప్పటికే మృతి చెందాడని తెలుసుకుని తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తల్లిదండ్రుల వాగ్వాదం
కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు రంగమ్మ, రామచంద్ర హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల కరస్పాండెంట్‌  ధనుంజయరెడ్డి, ప్రిన్సిపాల్‌ లలితాదేవితో వాగ్వాదానికి దిగారు. ‘మీరే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారం’టూ శాపనార్థాలు పెట్టారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి ఫోన్‌ చేసి తొండపాడు తిరునాలకు వస్తానని చెప్పాడని, అలాంటి వాడు ఎలా ఆత్మహత్య  చేసుకుంటాడని తల్లిదండ్రులు నిలదీశారు. మీరే ఎవరో చంపి.. ఉరివేసుకున్నాడని కట్టుకథలు చెబుతున్నారంటూ ఆరోపించారు. ఓ దశలో కళాశాల నిర్వాహకులపై దాడికి యత్నించారు.

కళాశాల గుర్తింపు రద్దుకు డిమాండ్‌
ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కూడా కళాశాల యజమానులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా కాలేజీలోనే హాస్టల్‌ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కట్టాలని, చదువుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే పవన్‌ కల్యాణ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మార్చురీ వద్ద ధర్నా
ఇంటర్‌ విద్యార్థి పవన్‌ కల్యాణ్‌ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ మృతుని తల్లిదండ్రులతో కలిసి ఆస్పత్రిలోని మార్చురీ వద్ద ధర్నా చేశారు. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారని, వెంటనే కళాశాలను సీజ్‌ చేసి కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐ ప్రభాకర్‌ గౌడ్, ఎస్‌ఐ యువరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు