ఆర్టీసీలో కాల్‌నాగు

20 Oct, 2017 11:54 IST|Sakshi

వడ్డీవ్యాపారి అవతారమెత్తిన సంస్థ ఉద్యోగి

ఐదేళ్లుగా సాగుతున్న వ్యవహారం

సకాలంలో బాకీ తీర్చకుంటే కేసులతో వేధింపులు

ఆ ఉద్యోగి అరాచకాలను నిర్ధారించిన విజిలెన్స్‌

కాల్‌నాగులు ఆర్టీసీ కార్మికులనూ వదలలేదు. తోటి కార్మికుడే యముడయ్యాడు.కార్మికులను పీల్చిపిప్పిచేస్తున్నాడు. అతడి బారిన పడిన వారిని అన్ని రకాలుగా వేధించాడు. చివరికి యూనియన్‌ నేతలు కల్పించుకుని విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్‌మణి ఘటన వెలుగులోకి వచ్చింది.

సాక్షి,అమరావతి బ్యూరో: ఆర్టీసీలో ఓ ఉద్యోగి వడ్డీ వ్యాపారి అవతారమెత్తాడు.. తోటి ఉద్యోగుల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులిచ్చాడు. అసలు మించి వడ్డీలే అధికంగా వసూలు చేశాడు. అప్పులు ఇచ్చే సమయంలో ఉద్యోగి భార్య పేరుతో ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోటు రాయించుకునే వాడు.. సకాలంలో అప్పు చెల్లించకపోతే మహిళలపై కోర్టులో కేసు వేసి వారిని మానసికంగా వేధింపులు గురిచేశాడు. అతడి ఆగడాలు శ్రుతిమించడంతో యూనియన్‌ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అతడి రాజకీయ పలుకబడితో చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు.

ఐదేళ్లుగా వ్యాపారం..
విజయవాడ పీఎన్‌బీఎస్‌ బస్టాండ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఐదేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే బస్టాండ్‌లో పనిచేసే ఉమామహేశ్వరరావుకు రెండేళ్ల కిందట రూ.2 లక్షల   రూ.4 వంతున వడ్డీతో అప్పు ఇచ్చాడు. ప్రతినెలా వడ్డీ తీసుకునే వాడు.. రెండేళ్లకే వడ్డీ రూపంలో అసలు తీసుకొన్నాడు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల వడ్డీ చెల్లింపులో ఆలస్యం కావడంతో అసలుతో పాటు వడ్డీ చెల్లించాలనీ వేధించడం మొదలుపెట్టాడు. కొంత సమయం ఇస్తే పూర్తిగా చెల్లిస్తానని ఉమామహేశ్వరరావు వేడుకున్నా అతని మనస్సు కరగలేదు. వెంటనే ఉమామహేశ్వరరావు భార్య పేరుతో తీసుకున్న ఖాళీ చెక్కులు ప్రామిసరి నోటును కోర్టులో దాఖలు చేశాడు. బాధితుడి భార్య కూడా ఓ చిరుద్యోగి కా>వడంతో వారు కోర్టు వరకు వెళ్లొద్దని కొంత టైం ఇస్తే అసలు వడ్డీ చెల్లిస్తామని వేడుకున్నా ఫలితం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోయి ఆర్టీసీలో యూనియన్‌ నేతల దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్‌ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి కాల్‌మనీ తరహాలో వేధించడం వాస్తవమేనని అతడిపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు.

అధికార పార్టీ నేత ఒత్తిడితో..
ఆర్టీసీలో కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. గతంలో విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఉద్యోగులు కూడా వడ్డీల పేరుతో వేధింపులకు గురిచేయడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేస్తున్నారు. విజిలెస్స్‌ అధికారులు నివేదిక ఇచ్చినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడిలే కారణమని పలువురు యూనియన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ సెక్యూరిటీ గార్డు బినామీల పేరుతో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని విచారించి డిస్మిస్‌ చేసిన అధికారులు ఈ ఉద్యోగి విషయంలో వెనుకంజ వేయడంపై అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని వారు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకున్నాం 
ఆర్టీసీ కార్మికులను వడ్డీల పేరుతో వేధిస్తున్న కార్మికుడిపై విచారణ చేపట్టాం. ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఇంక్రిమెంట్‌ కట్‌ చేశాం.– రామారావు, ఆర్‌ఎం 

మరిన్ని వార్తలు