ఎవరికి చెప్పాలి.. ఏమని చెప్పాలి..

28 Feb, 2020 08:45 IST|Sakshi
తులసి మృతదేహం ,తులసి (ఫైల్‌)

నా అనే వారు లేరని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

మూడు పేజీల సూసైడ్‌ నోట్‌  

జీడిమెట్ల: ‘నాకు అమ్మ, నాన్న లేరు..ప్రేమించిన వాడు ఆప్యాయంగా మాట్లాడటంలేదు.. కనీసం నా కోసం కొంత సమయాన్ని కేటాయించడంలేదు. కాలేజీకి  వస్తుంటే బస్తీలో పోకిరీలు వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి.. నేను ఎంత ప్రేమించినా నన్ను నన్నుగా ప్రేమించే వారు ఎవరూ లేరు.. ఇక నేను ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి అంటూ మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్మీడియేట్‌ విద్యార్థిని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూరారం డివిజన్‌ నెహ్రూ నగర్‌కు చెందిన తులసి(17)కి చిన్నతనంలోనే ఆమె తండ్రి లక్ష్మణ్, తల్లి సుశీల మృతి చెందారు. దీంతో అప్పటినుంచి ఆమె అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ చింతల్‌లోని బాగ్యరథి కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆమె నెహ్రూ నగర్‌కు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల ఆమెకు  ఇంటర్‌ పరీక్షలు సమీపించడంతో సదరు యువకుడు  మంచిగా చదువుకోవాలని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి అతను తులసితో మాట్లాడటం లేదు. దీంతో తాను ఒంటరినయ్యానని భావించిన తులసి గురువారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నా స్నేహితురాళ్లు చాలా మంచివాళ్లు..
నన్ను స్నేహితుల చాలా మంచిగా చూసుకుంటారు. వారికి నా ఇబ్బందులు చెప్పి వారిని బాధ పెట్టలేను. ఈ జన్మకు వారితో నా స్నేహం ఇక ఇంతే అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

పోకిరీలకు అడ్డుకట్ట వేయాలి..
గత కొంత కాలంగా కాలనీలో పోకిరీల బెడద ఎక్కువైందని స్థానికులు తెలిపారు. పోలీసులు బస్తీల్లో గస్తీ నిర్వహించి పోకిరీల బెడద నుండి మహిళలు, యువతులను కాపాడాలని కోరారు.

మరిన్ని వార్తలు