అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు

18 Jul, 2020 18:27 IST|Sakshi
నిందితుడు పవన్‌ శ్రీనివాస్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు గుట్టు రట్టు చేశారు. నగర వాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీలు చేయిస్తున్న పవన్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై శ్రీలంకతో పాటు భారత్‌లోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కేసు వివరాలను వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాకు వివరిస్తూ.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ ముప్పై కేసుల్లో నిందితుడని, స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టి నష్టపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో శ్రీనివాస్ కిడ్నీ అమ్ముకున్నాడు. ఒక్కొక్క కిడ్నీ అమ్మకంలో డాక్టర్లకు రూ.15 లక్షలు, డోనర్‌కు రూ.5 లక్షలు, నిందితుడు శ్రీనివాస్ రూ.5 లక్షల నుంచి 7 లక్షలు తీసుకునే వాడు. 2013లో శ్రీనివాస్ కిడ్నీ వ్యాపారం ప్రారంభించాడని తెలిపారు. ఇప్పటివరకు 30 కేసుల్లో శ్రీనివాస్ నిందితుడని, కిడ్నీ అమ్మేవారిని తీసుకుని శ్రీలంకలోని 4 ఆస్పత్రుల్లో అమ్మేవాడు. అక్కడ 9 ఆపరేషన్లలో శ్రీనివాస్ నేరుగా పాల్గొన్నారని జాయింట్‌ సీపీ తెలిపారు.

బంజారాహిల్స్‌ కమలాపురి కాలనీకి చెందిన నాగరాజుకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ కావడంతో ఆయన భార్య బిజ్జల భారతీ స్టార్‌ ఆసుపత్రికి తీసుకొచ్చింది. డయాలసిప్‌ చేయించేందుకు భర్తను తీసుకొచ్చే క్రమంలో భారతీని గమనించిన నిందితుడు శ్రీనివాస్‌.. విదేశాల్లో మీ భర్తకి మెరుగైన చికిత్స చేయిస్తానని నమ్మబలికాడు. ఇందు కోసం రూ.34 లక్షలు ఖర్చవుతాయని చెప్పగా, బాధితురాలు పలు దఫాలుగా నిందితుడికి సంబంధించిన పలు బ్యాంక్‌ అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. డబ్బును తీసుకుని  నిందితుడు పరారీ అయ్యాడు. జూన్ 2019లో శ్రీనివాస్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదయ్యింది.

మరిన్ని వార్తలు