అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

5 Feb, 2019 10:15 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగలు

గచ్చిబౌలి: పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం గచ్చిబౌళి కమిషనరేట్‌లో సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని, హపూర్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ సబ్దార్, షాన్వాజ్, నదీమ్, మహ్మద్‌ నయీమ్‌ అలియాస్‌ సోను, మహ్మద్‌ రషీద్‌ అలియాస్‌ మున్నా, మహ్మద్‌ ముస్తాఫా, మహ్మద్‌ ఆసీఫ్, ఇమ్రాన్‌ తదితరులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై ఢిల్లీ, బోపాల్, గ్వాలియర్, చంద్రపూర్, అమరావతి, ఔరంగాబాద్, బులంద్‌షాహార్,  విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్‌ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. 

రెక్కీ నిర్వహించి పగటి పూట చోరీలకు పాల్పడే వీరు జనవరి 20న రాజేంద్రనగర్‌లో ఓ ఇంట్లో చోరీ చేశారు. కొంపల్లి, కామాటిపుర ప్రాంతాల్లోనూ పంజా విసిరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ క్రైమ్‌ పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత నెల 31న గ్యాంగ్‌ లీడర్‌ మహ్మద్‌ సబ్దార్‌తో పాటు నిందితుడు షాన్వాజ్, రిసీవర్‌ ఇమ్రాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 500 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, ఇనుప రాడ్డు, స్క్రూడ్రైవర్, ఐదు సెల్‌ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ క్రైమ్‌ పోలీసులకు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ దయానంద్, సీఐలు పురుషోత్తం, వెంకటేశం, అశోక్, ఎస్‌ఐ రాజు  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు