క్రాంతివీర్‌... కిడ్నాపర్‌!

25 Jul, 2018 12:22 IST|Sakshi
సంపత్‌ నెహ్రా , శర్థక్‌ రావు

సిటీలో చిక్కిన అంతరాష్ట్ర నేరగాళ్ల కొత్త కోణాలు

తానో విప్లవ నాయకుడినంటున్న గ్యాంగ్‌స్టర్‌ నెహ్రా

2014లో బాలికను కిడ్నాప్‌ చేసిన శర్థక్‌ రావు బబ్రాస్‌

సాక్షి, సిటీబ్యూరో: ఆ ఇద్దరూ రెండు నెలల్లో నగరంలో చిక్కిన అంతరాష్ట్ర నేరగాళ్లు... ఒకరు జూన్‌లో చిక్కిన హర్యానా గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా కాగా... మరొకరు ఇటీవల పట్టుబడిన ‘స్టార్‌ చోర్‌’ శర్థక్‌ రావు బబ్రాస్‌... వీరిద్దరిలోనూ ఉన్న ‘కొత్త కోణాలు’ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘరానా గ్యాంగ్‌స్టర్‌ నెహ్రా తానో విప్లవ నాయకుడిని అంటూ అక్కడి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) పోలీసులకు ఊదరగొడుతున్నాడు. మరోపక్క చోరీలు, స్టార్‌ హోటళ్ల బిల్లులు ఎగ్గొట్టే నేరాలకే పరిమితం అనుకున్న శర్థక్‌ గతంలో ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన కేసులోనూ నిందితుడిగా తేలింది. 

నేను క్రాంతివీర్‌... నాది సమాజసేవ...
సైబరాబాద్, మియాపూర్‌ ఠాణా పరిధిలోని గోకుల్‌ ప్లాట్స్‌లో హర్యానా ఎస్టీఎఫ్‌ పోలీసులకు గత నెల మొదటి వారంలో చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న ఇతను బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టని విషయం తెలిసిందే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకునేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గంగోత్రి, బెంగళూరు, హరిద్వార్, పుణే, హుగ్లీల్లో తలదాచుకుని చివరకు నగరంలో చిక్కాడు. ఇక్కడ ఉంటూనే చండీఘడ్‌లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. ఇతడిని అరెస్టు చేసిన తర్వాత హర్యానా ఎస్టీఎఫ్‌ అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే తానో క్రాంతివీర్‌ (విప్లవ నాయకుడు) అని, తానే చేసేది సమాజ సేవ అంటూ చెప్పుకొచ్చాడు. తాను చేసినవి నేరాలంటే అస్సలు ఒప్పకోవడం లేదు. ఇతడిని నేరబాట పట్టించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ చేసిన బ్రెయిన్‌ వాష్‌ కారణంగానే సంపత్‌ ఇలా మారిపోయి ఉంటాడని ఎస్టీఎఫ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఇతడికి లండన్‌ నుంచీ నిధులు అందినట్లు ఎస్టీఎఫ్‌ గుర్తించింది. దీనిపై విచారణ జరపడానికి మరోసారి సిటీకి రావాలని భావిస్తోంది. 

మైనర్‌ కిడ్నాప్‌... కాటేజ్‌లో మకాం...
అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి వచ్చి దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో తన పంజా విసిరిన శర్థక్‌ రావు బబ్రాస్‌ను గోపాలపురం పోలీసులు గత వారం అరెస్టు చేశారు. బసేర హోటల్‌లో బస చేసి, అమర్సన్స్‌ పెరŠల్స్‌ అండ్‌ జ్యువెల్స్‌ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై కటకటాల్లోకి పంపారు. పోర్ట్‌ బ్లేయర్‌లోని ఎంజీ రోడ్‌ ప్రాంతానికి చెందిన శర్థక్‌ రావు బబ్రాస్‌ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్‌ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. 2014లో ఇతడిపై పోర్ట్‌ బ్లేయర్‌లోని ఫహ్రాగావ్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పిన ఇతను ఆమెను అపహరించుకు వెళ్లి అక్కడి బునియదాబాద్‌లోని కృష్ణ కాంటినెంటల్‌ కాటేజ్‌లో ఉంచాడు. అప్పట్లో ఆ బాలికతో తాను ఇండియన్‌ నేవీలో ఉన్నతాధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్టు  చేసిన తర్వాతే  ఉత్తరాదికి మకాం మార్చి స్టార్‌ హోటల్స్‌కు టోకరా వేయడం కొనసాగించాడు. 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా అన్ని కేసుల్లోనూ జైలు శిక్షలు సైతం పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు