చోరీ చేశారు.. చివరికి చిక్కారు

3 Feb, 2020 13:32 IST|Sakshi
పోలీసులతో అంతర్రాష్ట్ర దొంగలు

బ్యాంకులో చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు  

రూ.93,275 చిల్లర నాణేలు స్వాధీనం

తూర్పుగోదావరి, మామిడికుదురు: సినీ ఫక్కీలో వారు బ్యాంకుకే కన్నం వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మామిడికుదురులోని ఎస్‌బీఐలో చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ఏడుగురు అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారిని ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చోరీకి 11 మంది సభ్యులు వ్యూహం రచించారు. ఇందులో ఓ మహిళతో సహా ఏడుగురిని గత నెల 30న మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చిన వారిలో మహారాష్ట్రకు చెందిన సంతోష్‌హరి ఖాదం, సచిన్‌ హరోన్‌సిం«థే, మంగేష్‌ దనాజీగోర్, అముల్‌ మహదేవ్‌బాగల్, సవితా సంతోష్‌హత్కర్, యూపీకి చెందిన అస్లాం ఖాన్, జాఫర్‌ అలీ ఉన్నారు. నిందితుల నుంచి రూ.93,275 చిల్లర నాణేలతో పాటు రెండు చిన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన బాబు కౌసర్‌ అలియాస్‌ బాబూఖాన్, పస్తా అలియాస్‌ తాజాబ్‌ అలమ్‌కల్లుఖాన్, నవజాద్‌ నన్సార్‌ అలీ అలియాస్‌ సహబాజ్‌ఖాన్, ఖళియా ఇస్రాక్‌ అలీఖాన్‌ అనే గుడ్డూఖాన్‌లను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా కాతే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కేసులో అరెస్టు చేశారు. వారిని మామిడికుదురు ఎస్‌బీఐ చోరీ కేసులో అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. దోపిడీకి పాల్పడిన మిగతా సొమ్మును ఎక్కడ దాచారో వారి నుంచి కూఫీ లాగుతామన్నారు. నిందితులంతా పాత నేరస్తులే అన్నారు. కొల్హాపూర్‌లో వారిని అరెస్టు చేసి ట్రాన్సిట్‌ రిమాండ్‌కు తీసుకుని రాజోలు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలుకు తరలించామన్నారు.

రెండు నెలల క్రితమే రెక్కీ  
ఈ ముఠా బ్యాంకు చోరీల్లో ఆరితేరారు. ఇందులో భాగంగా మామిడికుదురులో చోరీకి రెండు నెలల ముందే రెక్కీ నిర్వహించారు. రెండు కార్లలో అమలాపురం మీదుగా మామిడికుదురుకు గత నెల 24వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ కార్లను వెనక్కి తిప్పి పంపించేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్, సిలిండర్ల సాయంతో బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి స్ట్రాంగ్‌ రూమ్, సెల్ప్‌ లాకర్లను తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్ట్రాంగ్‌ రూమ్‌లోని అల్యూనిమినియం పెట్టెల్లో భద్రపరిచిన రూ.18.76 లక్షలను దోచుకుపోయారు. తెల్లవారు జామున 4.30 గంటల వరకు బ్యాంకులోనే ఉండి తరువాత బయటకు వచ్చి అక్కడ రెడీగా ఉన్న తమ వాహనాల్లోనే తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు చిక్కారు. అక్కడి పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మన జిల్లా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రాజోలు సీఐ డి.దుర్గాశేఖరరెడ్డితో పాటు వారి దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసూం బాషాలు అభినందించారు.

మరిన్ని వార్తలు