మలుపే ఆయువు తీసిందా?

9 May, 2019 13:44 IST|Sakshi
తన ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్న గోపాల్‌(ఫైల్‌)

వివాహానికి వెళ్లి వస్తుండగా         అదుపు తప్పి బైక్‌ బోల్తా

అక్కడికక్కడే ఇంటర్‌ విద్యార్థి         మృతి

మరో యువకుని పరిస్థితి             విషమం

అర్ధరాత్రిలో అందని వైద్యసేవలు

మలుపులే ప్రమాదానికి పిలుపు అంటూ రోడ్డు రవాణా శాఖ సందేశాలకే పరిమితమవుతోంది. ఫలితంగా ఎంతోమంది మృత్యువాతతోపాటు క్షతగాత్రులవుతున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా మలుపే మృత్యువుగా మారి ఒక యువకుడిని అనంతలోకాలకు తీసుకుపోగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా మార్చేసింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

కాశీబుగ్గ: పలాస మండలం తర్లాకోట çపంచాయతీ పరిధిలో తీవ్ర భయంకరమైన మలుపు కలిగిన చెరువు వద్ద రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి మోటారుబైక్‌ అదుపు తప్పి బోల్తాపడగా కుమ్మరి గోపాల్‌ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుకనే కూర్చున్న కుమ్మరి ఉమాశంకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రెంటికోట గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిద్దరిదీ పలాస–కాశీ»బుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడుకు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో సకాలంలో చికిత్సకు తరలించే దిక్కు లేకపోయింది. చివరకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే గోపాల్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ యువకుడు పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తికాగా, ద్వితీయ సంవత్సరం చదవాల్సి ఉంది. తల్లి బుద్ధి జీడిపరిశ్రమలో పనిచేస్తుండగా, తండ్రి మోహనరావు మేస్త్రీగా పని చేస్తున్నాడు. సోదరుడు నరసింహమూర్తి ఐటీఐ పూర్తి చేసి ఒడిశాలో తన మామయ్య వద్ద వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు. అందరితో సరదాగా ఉండే గోపాల్‌ మృతి చెందిన విషయం తెలుసుకుని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు కాశీబుగ్గ ఎస్సై రాజేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద సూచికలేవి?
చెరువు వద్ద మలుపు రోడ్డులో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. పలు గ్రామాల్లో ఎక్కువగా మలుపులున్న బీటీరోడ్లు ఉన్నాయి. వీటి నిర్మాణ పనుల సమయంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు ప్రమాదాలు అరికట్టవచ్చు. ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు