నకిలీ విజిలెన్స్‌ అధికారుల మోసాలపై దర్యాప్తు

28 Feb, 2018 12:32 IST|Sakshi
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ క్రాంతి రాణా టాటా చిత్రంలో డీసీపీ గజారావు భూపాల్‌ నిందితులు(వెనుక నిల్చున్న వారు)

నకిలీ విజిలెన్స్‌ అధికారుల మోసాలపై దర్యాప్తు

రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో దోపిడీ

దొంగ ఐడీ కార్డు, బిల్లులతో హల్‌చల్‌

ఆటకట్టించిన ఉయ్యూరు పోలీసులు

ఉయ్యూరు: నకిలీ విజిలెన్స్‌ అధికారి పేరుతో కొనసాగిస్తున్న దందాకు ఉయ్యూరు పోలీసులు చెక్‌ పెట్టారు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగిస్తున్న మోసాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గుట్కా విక్రయ దుకాణాలనే టార్గెట్‌గా చేసుకుని లక్షలు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆ కేటుగాళ్ల మాయపంథాలో ఎందరో చిరువ్యాపారులు చిక్కుకున్నవారే.

అచ్చం విజిలెన్స్‌ అధికారిలానే..
విజయవాడకు చెందిన శ్రీనివాసరావు నకిలీ విజిలెన్స్‌ అధికారిగా అవతారమెత్తి సుమారు రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. బాలాజీతో కలిసి చిరు వ్యాపారులని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దందా సాగిస్తున్నారు. నిజమైన విజిలెన్స్‌ అధికారిలా కనపడేలా ఐడీ కార్డు పెట్టుకుని దొంగ రశీదు బుక్కుతో కారు దిగి హడావుడి చేసి వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తూ యథేచ్ఛగా దోచేస్తున్నట్లు తెలిసింది. ‘‘శ్రీనివాసరావు ముందుగానే ఎక్కడ గుట్కాలు అమ్ముతారో తెలుసుకుంటాడు. ఆ షాపు తిన్నగా కారు ఆపి నేరుగా షాపులోకి వెళ్లి అదేంటి.. ఇదేంటి అంటూ హడావుడి చేస్తాడు. ఏం గుట్కాలు అమ్ముతున్నావంటూ గుట్కా ప్యాకెట్లు పట్టుకుని కేసు రాస్తున్నా, కోర్టుకు వెళ్లి రూ.25 వేలు ఫైను కట్టుకోండి అంటూ భయబ్రాంతులకు గురిచేస్తాడు. ఆ వ్యాపారి సరిచేయమంటూ ప్రాథేయపడతాడు. చివరకు అలాఇలా రూ.5 వేలు నుంచి రూ.10 వేలు మధ్యలో బేరం కుదుర్చుకుని ఆ నకిలీ రశీదు ఇచ్చి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు తాను నిజాయితీ అధికారినంటూ, ఫార్మాల్టీస్‌ ఏమీ వద్దని చెబుతూ ఓ రెండు సిగరెట్‌ పెట్టెలు ఇవ్వండని తీసుకుని మరీ వెళ్లిపోయి మరో కొత్త ఊరిని వెతుక్కుంటాడు.’’ ఇదే పంథాలో శ్రీనివాసరావు తన మోసాలు కొనసాగిస్తున్నాడు. గుట్కాలు అమ్మడం నేరం కావడంతో వ్యాపారులు ఎవ్వరూ ఇంతవరకు పోలీసులను ఆశ్రయించకపోవడంతో దర్జాగా దోచుకుంటూ తిరుగుతున్నాడు.

ఉయ్యూరులో వెలుగులోకి..
పట్టణంలోని ఓ దుకాణంలో తన పంథాలోనే శ్రీనివాసరావు దాడి చేసి హడావుడి చేశాడు. ఈ క్రమంలోనే గల్లా పెట్టెలోని రూ.60 వేలు మాయం చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో ఆ వ్యాపారి టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ సత్యానందం నేతృత్వంలో ఎస్‌ఐ రామారావు సిబ్బందితో శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు మాటువేసి మరీ పట్టుకోవడంతో అసలు డొంకంతా కదులుతోంది.

రూట్లు మారుస్తూ.. కారు మార్చి..
శ్రీనివాసరావు తన మోసాలకు రెండు కార్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. షాపులపై దాడులకు వెళ్లేటప్పుడు అద్దెకు స్విఫ్ట్‌ కారును వినియోగించి, డబ్బు దోచుకున్న అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు తన సొంత ఇండికా కారును వాడి దొరక్కుండా తిరుగుతాడు. ఈ క్రమంలోనే ప్రధాన రోడ్లగుండా కాకుండా ప్రత్యామ్నాయం డొంక రోడ్లగుండా వెళ్లి చిక్కకుండా పోతున్న కేటుగాడిని అదే వ్యూహాన్ని అనుసరించి పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం శ్రీనివాసరావుతో పాటు రెండు కార్లు పోలీసుల అదుపులో ఉన్నాయి. మరో వ్యక్తితోపాటు ఇంకా ఎక్కడెక్కడ నేరాలు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నట్లు సమాచారం.

నకిలీ విజిలెన్స్‌ అధికారుల అరెస్టు
విజయవాడ:   విజిలెన్స్‌ అధికారుల ముసుగులో అక్రమ వసూళ్లకు, దోపిడీలకు పాల్పడే ఇద్దరు నిందితులను ఉయ్యూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేటలో లా అడ్‌ అర్డర్‌ డీసీపీ క్రాంతి రాణా టాటా తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వజ్జల వెంకట శ్రీనివాస్‌ కుమార్‌ డిగ్రీ వరకు చదివి, చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి తేలికగా డబ్బు సంపాదించేందుకు మరో ఇద్దరితో కలిసి నకిలీ విజిలెన్స్‌ అధికారులుగా డబ్బు వసూళ్లు చేస్తున్నారు. రెండేళ్లుగా శ్రీనివాసకుమార్‌ నగరంలో నివసించే మహేష్, లోకం బాలాజీతో కలిసి విజిలెన్స్‌ అధి కారులుగా, పొల్యూషన్‌ బోర్ఢు అధికారులుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. యజమానులను బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వెంకట శ్రీని వాసకుమార్, బాలాజీలను విద్యాధరపు రం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు, నకిలీ రసీదులు, స్టాంపులు స్వాధీ నం చేసుకున్నారు. ఓ కారు, బైక్‌కూడా స్వా ధీనం చేసుకున్నారు. మరో నిం దితుడు మహేష్‌ పరారీలో ఉన్నాడు.డీసీపీ గజరావు భూ పాల్, ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు