రాధిక ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం

3 Apr, 2018 02:58 IST|Sakshi

అన్ని కోణాల్లో పోలీసుల విచారణ.. కాల్‌ డేటా సేకరణ 

సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు 

ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి 

హైదరాబాద్‌: వీ6 న్యూస్‌ రీడర్‌ వెంకన్నగారి రాధిక ఆత్మహత్య కేసులో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. రాధిక తన ఫోన్‌ ద్వారా నెల రోజులుగా ఎవరెవరితో సంభాషించిందనే కాల్‌ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర ఒత్తిళ్లయినా ఉన్నాయా? అనే కోణంలో దృష్టి సారించారు. రాధిక ఇంటి సమీపంలో ఉండే స్నేహితులు, పరిచయస్తులతో పాటు కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉండేదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

మూసాపేటలో శ్రీసువిల అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్లుగా రాధిక తన తండ్రి, కుమారుడు, సోదరితో ఉంటోంది. ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు పొందిన రాధిక ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. రాధిక గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోందని సహ ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాధిక రాత్రి 10.40 నిమిషాల సమయంలో అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తుపైకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్‌మన్‌ అపార్ట్‌మెంట్‌లోని వారికి సమాచారమిచ్చాడు. ముఖం ఛిద్రం కావడంతో తొలుత మృతురాలు ఎవరనేది గుర్తించలేకపోయారు. రాధిక సోదరి వచ్చి మృతురాలిని గుర్తించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ‘నా బ్రెయినే నా శత్రువు’అంటూ రాధిక రాసిన సూసైడ్‌ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా, రాధిక మృతదేహానికి తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు