విచారణ వేగవంతం

23 Oct, 2019 11:22 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలస్తున్న నార్త్‌జోన్ డీసీపీ కళ్మేశ్వర్‌ సింగెన్ వార్, సీఐ చంద్రశేఖర్‌

రూ.18లక్షల నగదు, 3 కిలోల బంగారం మాయం

కేసును ఛేదించేందుకు రంగంలోకి ప్రత్యేక టీంలు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ

బొల్లారం:  బోయిన్ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేసే దిశగా మూడు ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు బేగంపేట ఏసీపీ రాంరెడ్డి చెప్పారు. చోరీ జరిగిన ఇంటిని మంగళవారం ఉదయం నార్త్‌జోన్  డీసీపీ కళ్మేశ్వర్‌ సింగెన్ వార్‌తో కలిసి ఏసీపీ రాంరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌ పరిశీలించారు. అనంతరం చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ మల్లిఖార్జున్  నగర్‌లో నివాసముండే ఇంటి యజమాని సరళ తన కుమారులతో కలిసి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బోయిన్‌ పల్లిలోని సెంటర్‌ పాయింట్‌కు షాపింగ్‌ కోసం వెళ్లింది. ఆ సమయంలో మారుతాళంతో ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు బెడ్రూంలోని బీరువాలో ఉన్న 3కిలోల బంగారం, రూ.18 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బయటి నుంచి ఇంటికి వచ్చిన సరళ ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు తెలుసుకుంది. వేసిన తాళాలు వేసినట్లే ఉండగా చోరీ ఎలా జరిగిందని ఆమె ఆందోళనకు గురైంది. వెంటనే విషయాన్ని బోయిన్‌ పల్లి పోలీసులకు తన కుమారుడితో కలిసి ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి చోరీకి పాల్పడిన వారి కోసం విచారణ చేపడుతున్నామని ఏసీపీ తెలిపారు.

తెలిసినవారి పనేనా..?
మారు తాళం చెవితో సునాయాసంగా ఇంట్లోకి చొరబడటం అంటే తెలిసినవారి పనై ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లోకి చొరబడ్డ నిందితులు నగదు, ఆభరణాలు భద్రపరిచిన స్థలానికి నేరుగా వెళ్లడంతో పాటు ఇంటి యాజమాని సరిగ్గా బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుల్ల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీఎత్తున నగదు, బంగారం చోరీకి గురికావడంతో స్థానికులతో పాటు పోలీసులు షాక్‌ అయ్యారు. మరోవైపు సరళ వడ్డీ వ్యాపారం చేస్తుండటంపై కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు