ఇరీడియం లోహం పట్టివేత

19 Apr, 2018 12:35 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న లోహపు ముక్కలు

ఆరుగురి అరెస్ట్‌.. పరారీలో ముగ్గురు

లోహం విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా  

గోదావరిఖని(రామగుండం): బంగారం బరువు ఎక్కువగా ఉండేందుకు దానిలో కలిపే విలువైన ఇరీడియం లోహాన్ని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. చత్తీస్‌ఘడ్‌ నుంచి తీసుకువచ్చి గోదావరిఖనిలో విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.  

స్నేహితుల ద్వారా.. 

గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కన్నం విజయ్‌ హార్వేస్టర్‌ వ్యాపారం చేస్తాడు. గోదావరిఖనిలో బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండడంతో అందులో కలిపేందుకు ప్రభుత్వం నిషేధించిన ఇరీడియం లోహాన్ని అమ్మేందుకు అతని స్నేహితులు ఆదిలాబాద్‌ జిల్లా పిట్టలవాడకు చెందిన సింగిరెడ్డి లచ్చిరెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన ఏ.కిషన్, నస్పూర్‌ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఎస్‌.తిరుపతి, ఆదిలాబాద్‌ జిల్లా భీమేశ్వరం ప్రాంతానికి చెందిన జె.గంగన్న, జైనథ్‌కు చెందిన బి.అజయ్, బీంపూర్‌కు చెందిన ఎస్‌.లింగారెడ్డి విజయ్‌ని కలిశారు. ఈనెల 14న ఎన్టీపీసీలోని ఓ లాడ్జిలో కన్నం విజయ్‌ నుంచి రూ.30వేలు తీసుకుని కొంత ఇరీడియం లోహన్ని అందజేశారు. 

డొంక ఇలా కదిలింది... 

రెండ్రోజుల తరువాత మరికొంత లోహాన్ని తీసుకొస్తామని చెప్పి రాకపోవడంతో విజయ్‌ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు ఆ కేసును సీసీఎస్‌కు అప్పగించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు లోహాన్ని తరలిస్తున్న పై ఆరుగురిని బుధవారం ఎన్టీపీసీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు కిలోల ఇరీడియం లోహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఇరీడియం అసలా..? నకిలీనా..? అని తేల్చేందుకు ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. అసలుదైతే దాని విలువ రూ.50లక్షలు ఉంటుందనే అంచనా వేస్తున్నామని అడిషనల్‌ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి వివరించారు. 

ఛత్తీస్‌గఢ్‌నుంచి నుంచి రవాణా... 

అరుదుగా లభించే ఈ లోహాన్ని చత్తీస్‌గఢ్‌ గుట్టల నుంచి సేకరించి ఏటూరు నాగారం మీదుగా రవాణా చేస్తున్నారని తెలిపారు.  ఇరీడియమ్‌ లోహం సేకరించే తిరుమణి నవీన్‌కుమార్, తునికి శంకరాచారి, మామిడిపెల్లి శ్రీనివాస్‌ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. సీసీఎస్‌ ఏసీపీ చంద్రయ్య, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు ఎస్‌.ప్రసాద్, రమేష్‌ను అభినందించారు.    
 

మరిన్ని వార్తలు