పేర్లే పట్టించాయి..

10 Jan, 2018 11:23 IST|Sakshi
ఐరన్‌ చోరీకి ఉపయోగించే లారీ ఇదే

చిక్కిన ఐరన్‌ దొంగలు

లారీపై ఉన్న పేర్లు ఆధారంగా గుర్తింపు

ఎంత చాకచక్యంగా దొంగతనం చేసినా.. ఎక్కడో ఒక చోట దొంగలు దొరికిపోవడం ఖాయం. ఏదో ఒక క్లూ వారిని కచ్చితంగా పోలీసులకు చిక్కేటట్టు చేస్తుంది. సరిగ్గా అదే క్లూ ఆ ఇనుప ఊచలు చోరీ చేసే వారిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. – రాజానగరం

ఐరన్‌ దుకాణాల వద్ద బయట నిల్వ ఉంచే ఐరన్‌ (ఇనుప ఊచలు) కట్టలను చాకచక్యంగా దొంగిలించే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. జిల్లాలోని రావులపాలెం నుంచి తుని వరకు అర్ధరాత్రి సమయాల్లో నిత్యం ఈ చోరీలనే వృత్తిగా చేసుకున్న ఆ ముఠాలోని కొందరిని రవాణాకు ఉపయోగించే లారీతో సహా స్థానిక ఐరన్‌ వ్యాపారులు జగ్గంపేటలో మంగళవారం పట్టుకుని, రాజానగరం పోలీసులకు అప్పగించారు.

రూ.వెయ్యి మాత్రమే
ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఐరన్‌ దొంగతనాలు చేయడం ఈ ముఠాకు అలవాటైంది. అలా దొంగిలించిన ఐరన్‌ కట్టలను(కట్ట విలువ రూ.5 వేలు వరకు ఉంటుంది) ఒక్కోదాన్ని రూ.వెయ్యికి కత్తిపూడిలో విక్రయిస్తుంటారు. సాధారణంగా లారీకి 50 కట్టలు వేస్తారు. అందుకు సుమారుగా గంటకు పైనే సమయం పడుతుంది. కాని వీరు కేవలం 20 నిమిషాల్లోనే ఎటువంటి శబ్దం రాకుండా లోడు చేసేస్తారు. ఒకవేళ అలికిడై ఎవరైనా వస్తే వారిని హతమార్చడానికి కూడా వెనుకాడరు. వీరు చోరీ చేసిన ఐరన్‌ను కత్తిపూడిలో ఒక వ్యాపారికి కొనుగోలు చేస్తుంటాడు. అతనికి రాజకీయంగా బలం ఉండడంతోపాటు అతడి ఏరియాకు వెళితే చాలు ఎవరూ ఏమిచేయలేరనే ధీమాను నిందితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా రాజమహేంద్రవరం, కడియం, రావులపాలెం, రాజానగరం, జగ్గంపేట, ఇలా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వాటి వివరాలను కూపీలాగే పనిలో పోలీసులు ఉన్నారు.

చోరులను పట్టించిన దుర్గమ్మ, లక్ష్మి
గత నెల 13న రాజానగరంలో ఒక ఐరన్‌ దుకాణం వద్ద ఉన్న ఐరన్‌ కట్టలను అర్ధరాత్రి 12.30 గంటల తరువాత ఒక లారీలో వచ్చిన దుండగులు అపహరించుకుపోయారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దుండగుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే బాగా పాతదిగా ఉన్న ఆ లారీ నంబరు స్పష్టంగా కనిపించకపోవడంతో కేసు ముందుకు వెళ్లలేదు. అయితే ఆ లారీ పై భాగంగా ఒకవైపున దుర్గమ్మ, లక్ష్మి అనే పేర్లు ఇంగ్లిష్‌లో ఉండటాన్ని బాధితుడు, స్థానిక ఐరన్‌ వ్యాపారి పాతూరి వీరబాబు గుర్తుంచుకుని, ఆ లారీ కోసం రోజూ గాలిస్తూనే ఉన్నాడు. ఇంతలో రెండు రోజుల క్రితం స్థానిక హైస్కూలు జంక్షన్‌లో మరో ఐరన్‌ దుకాణం వద్ద మొత్తం లోడు మాయం చేసేశారు. అది కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం, లారీ ఒక్కటే కావడంతో బాధితులు ఇరువురూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జగ్గంపేట వెళ్లిన వారికి ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీ కనిపించింది. దానిపై దుర్గమ్మ, లక్ష్మి పేర్లు సీసీ కెమెరాలో చూసిన విధంగానే ఉండడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారి సాయంతో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు.  

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన లారీ ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ ఈ చోరీలకు సూత్రధారిగా గుర్తించారు. ఆ సమయంలో జగ్గంపేటలోని ఒక థియేటర్‌లో సినిమా చూస్తున్న అతడిని, వేరొక చోట హోటల్‌లో భోజనం చేస్తున్న జట్టు కూలీలు ముగ్గురిని అదుపులోకి తీసుకుని లారీతో సహా రాజానగరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు