ఇష్రత్ జహాన్‌ కేసు.. పిటిషనర్‌ మృతి

13 Apr, 2018 15:48 IST|Sakshi
గోపినాథ్‌ పిళ్లై(ఎడమ), ఎన్‌కౌంటర్‌ దృశ్యాలు

తిరువనంతపురం : ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు పిటిషనర్‌ గోపినాథ్‌ పిళ్లై మృతి చెందారు. కేరళలో అలపుజ్జా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో 76 ఏళ్ల పిళ్లై తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. కాగా, గోపినాథ్‌ పిళ్లై... 2004 గుజరాత్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఒకరైన జావెద్ షేక్ అలియాస్‌ ప్రణేశ్‌ పిళ్లై తండ్రి.

ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ముంబైకి చెందిన19 ఏళ్ల విద్యార్థిని ఇష్రాత్ జహాన్‌, మరో ముగ్గురిని 2004, జూన్ 15న ఎన్‌కౌంటర్‌ చేశారు. మృతులను జావెద్ గులాం షేక్(ప్రణేశ్‌ పిళ్లై), అంజాద్ అలీ రానా, జీషన్ జోహార్‌ గా గుర్తించారు. అయితే తన కొడుకు అమాయకుడని.. ఇది పక్కా ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అంటూ వాదిస్తూ గోపినాథ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత మిగతా బాధిత కుటుంబాలు కూడా ఆయను తోడయ్యాయి. మోదీ ప్రభుత్వం సానుభూతి పొందటం కోసమే అమాయకులైన వారిని చంపేశారని పిటిషనర్లు అప్పుడు వాదనలు వినిపించారు.  (ఇష్రత్‌పై లాలూ కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు)

ఇదిలా ఉంటే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇదో ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని తేల్చి ఛార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సంయుక్తంగా ఈ ఎన్‌కౌంటర్ లో పాల్గొన్నాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లను ఇందులో చేర్చి దర్యాప్తు కొనసాగించింది.

మరిన్ని వార్తలు