రాజధానిలో మళ్లీ ఐసిస్‌ కలకలం

21 Apr, 2019 02:00 IST|Sakshi
మసూద్‌ తాహాజ్‌ నివాసముంటున్నది ఈ ఇంట్లోనే.., తాహాజ్‌ను అదుపులోకి తీసుకుంటున్న ఎన్‌ఐఏ బృందం

నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్‌ఐఏ

నేడు కూడా విచారణకు రావాలని ఆదేశం

అదుపులోకి తీసుకున్న వారంతా ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌ అనుచరులే

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో మరోసారి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) కలకలం రేగింది. గతేడాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ–ఢిల్లీ) అరెస్టు చేసిన ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్, అతని అనుచరుడు ఖదీర్‌ల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శనివారం మహారాష్ట్రలోని వార్దాతోపాటు హైదరాబాద్‌లోని షహీన్‌ నగర్, శాస్త్రీపురంలోని కింగ్స్‌ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లిలలో ఏకకాలంలో దాడులు చేసింది. బాసిత్‌ రెండో భార్య మోనాతోపాటు అతడి స్నేహితులు, అనుచరులైన జీషాన్, మసూద్‌ తాహాజ్, షిబ్లీ బిలాల్‌లను అదుపులోకి తీసుకుంది. మోనాను మహారాష్ట్రలో, మిగిలిన ముగ్గురినీ గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో ప్రశ్నించింది. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వారి నుంచి 13 సెల్‌ఫోన్లతోపాటు 11 సిమ్‌కార్డులు, ఐపాడ్, ఎక్స్‌టెర్నల్‌ హార్డ్‌డిస్క్, రెండు ల్యాప్‌టాప్స్, ఆరేసి చొప్పున పెన్‌డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులు, మూడు వాకీటాకీ సెట్స్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. 

సోషల్‌ మీడియా ద్వారా రిక్రూట్‌మెంట్‌... 
దుబాయ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగే ‘అబుదాబి మాడ్యూల్‌’పై ఎన్‌ఐఏ 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మర్నాడే ప్రధాన నిందితుడు షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లామ్‌ను, రెండో నిందితుడు అద్నాన్‌ హసన్‌ను, మూడో నిందితుడు మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లను అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడ నుంచే ఐసిస్‌ కోసం పని చేశారు. ఐసిస్‌కు చెందిన కీలక నేత ఖలీద్‌ ఖిల్జీ (కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌ అప్పట్లో దుబాయ్‌ కేంద్రంగా ఐసిస్‌ కార్యకలాపాలు నడిపాడు. ఈ నలుగురూ సోషల్‌ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తూ దేశంలో ఐసిస్‌ కోసం రిక్రూట్‌ చేసుకోవడం, వారికి అవసరమైన నిధులు సమకూర్చడం, సిరియా వెళ్లేందుకు సహకరించడం వంటివి చేయడానికి కుట్రపన్నారు. వారికి అప్పట్లో దుబాయ్‌లో నివసించిన ఈదిబజార్‌వాసి మహ్మద్‌ ముజ్‌తబ ద్వారా చంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్‌ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపిన అద్నాన్‌ హసన్‌ భారీగా నిధులు సమకూర్చాడు.

అద్నాన్‌ దుబాయ్‌ నుంచే బాసిత్, సన, ఖురేషీలతోపాటు అబ్రార్, మాజ్, ఫారూఖ్, అద్నాన్, నోమన్, లతీఫ్‌లతోనూ సంప్రదింపులు జరిపాడు. 2014 ఆగస్టులో బాసిత్‌ తన స్నేహితులు, సమీప బంధువులైన నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలసి బంగ్లాదేశ్‌ మీదుగా అఫ్ఘానిస్తాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశాడు. ఇందుకోసం కోల్‌కతా చేరుకోగా వారిని అక్కడ పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. కౌన్సెలింగ్‌ అనంతరం విడిచిపెట్టారు. అయినప్పటికీ పంథా మార్చోకోని బాసిత్‌ బృందం... ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాగ్‌పూర్‌ మీదుగా శ్రీనగర్‌ చేరుకొని పీఓకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్‌ 24న ప్రయాణం ప్రారంభించి 27న నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై ఎన్‌ఐఏ అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది.

వారంతా నేరుగా ఐసిస్‌ కీలక నేత షఫీ ఆర్మర్‌తో సంబంధాలు నెరిపారు. ‘అబుదాబి మాడ్యూల్‌’పై ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్‌ 2016లో కేసు నమోదు చేసింది. అప్పట్లోనే ముగ్గురినీ అరెస్టు చేసింది. దీనికి కొనసాగింపుగా చెన్నై, ఢిల్లీల్లోనూ అరెస్టులు జరిగాయి. నాటి దర్యాప్తులోనే బాసిత్, ఖరేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, సన, మాజ్, ఖురేషీ, ఖదీర్‌ ఇళ్లలో సోదాలు చేయడంతోపాటు కీలక ఆధారాలు, పత్రాలు స్వాధీనం చేసుకుంది. అబ్దుల్లా బాసిత్‌తోపాటు షహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ను అరెస్టు చేసింది. అప్పట్లో బాసిత్‌ విచారణలో అనేకవిషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అనుమానితుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌... 
మసూద్, బిలాల్‌ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. మసూద్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నలుగురు అనుమానితుల్ని వివిధ కోణాల్లో విచారించి పంపారు. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో అధ్యయనం చేస్తున్నారు. ఈ విశ్లేషణలో సాంకేతిక ఆధారాలు లభిస్తే అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ... 
బాసిత్‌కు టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన హుజైఫా అనే ఐసిస్‌ కీలక నేత గతేడాది మార్చిలో కొన్ని కుట్రలు చేశాడు. ఆయుధాలు సమకూర్చుకొని స్థానికంగా ఆపరేషన్స్‌ చేయాలని బాసిత్‌ను ప్రేరేపించాడు. దీంతో పంజాబ్, ఢిల్లీ, బిహార్‌ల నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ బాసిత్‌ బదులిచ్చాడు. తాను అందించే నిధులతో ఓ భారీ వాహనాన్ని ఖరీదు చేసుకోవాలని, దాన్ని వినియోగించి జనసమ్మర్థ ప్రాంతంలోకి దూసుకెళ్లి వీలైనంత మందిని ‘లోన్‌ వూల్ఫ్‌’తరహాలో దాడులు చేయాలని ఉసిగొల్పాడు. అలాగే కత్తులతో కనిపించిన వారినల్లా పొడుచుకుంటూ పోవాలని నూరిపోశాడు. దీంతో బాసిత్‌ తాను ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా బలగాలు, నిఘా వర్గాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, ఓ వర్గానికి చెందిన ముఖ్యుల్ని టార్గెట్‌ చేసుకుంటానని చెప్పాడు. ఈ ఆపరేషన్స్‌ కోసం అతనికి కొన్ని నిధులు కూడా అందాయి.

ఆ ఏర్పాట్లలో ఉండగా ఈ కుట్రలు కార్యరూపం దాల్చకుండానే బాసిత్, అతడికి సహకరించిన ఖదీర్‌ కటకటాల్లోకి చేరారు. గతేడాది వారిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ... రెండు నెలల క్రితం అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. అరెస్టు కావడానికి ముందు బాసిత్‌తో సంబంధాలు నెరపిన అతడి స్నేహితులు షహీన్‌నగర్‌కు చెందిన జీషాన్, శాస్త్రీపురంవాసి మసూద్‌ తాహాజ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షిబ్లీ బిలాల్‌లతోపాటు మహారాష్ట్రలోని వార్దాకు చెందిన బాసిత్‌ రెండో భార్య మోనాపైనా కేంద్ర నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయి. బాసిత్‌ చేపట్టలేని ఆపరేషన్స్‌ను పూర్తి చేయడానికి వాళ్లు సిద్ధమవుతున్నారని గుర్తించాయి. బాసిత్‌ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు... శనివారం ఏకకాలంలో హైదరాబాద్, మహారాష్ట్రల్లోని నాలుగు ప్రాంతాల్లో దాడులు చేసి మోనా, జీషాన్, మసూద్‌ తాహాన్, షిబ్లీ బిలాల్‌లను అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు