ఐసిస్‌లో 143

7 Aug, 2018 08:57 IST|Sakshi

సిరియాకు రప్పించి వివాహం చేసుకోవాలనే యోచన

అద్నాన్‌ హసన్‌ విచారణలోవెలుగులోకి...

అభియోగ పత్రాల్లో కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఏ

యువతి ఇంట్లోనూ సోదాలు

సాక్షి, సిటీబ్యూరో: ఇదో ‘ఉగ్ర ప్రేమకథ’. సిరియా కేంద్రంగా ఐసిస్‌కు నేతృత్వం వహిస్తున్న ఇద్దరు కీలక నేతలు సిటీ అమ్మాయిని ఇష్టపడ్డారు.  ఆమెను సిరియాకు రప్పించి వివాహం చేసుకోవాలని భావించారు. అయితే ఈ లవ్‌ స్టోరీకి శుభం కార్డు పడకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది. 2016లో వెలుగులోకి వచ్చిన ఈ ‘ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ’ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) యూనిట్‌ ‘అబుదాబి మాడ్యుల్‌’ కేసు అభియోగ పత్రాల్లో పొందుపరిచింది. ఆ ఉగ్ర నేతలు అబు హంజ అల్‌ ముజాహిర్, అబు జకారియా కాగా... ఆ యువతి ఐసిస్‌ అనుమానితుడు అబ్దుల్లా బాసిత్‌ సోదరి సనా. ఎన్‌ఐఏ సోమవారం వీరి ఇళ్లల్లోనూ సోదాలు చేసినోటీసులు ఇచ్చింది. ఐసిస్‌ ఉగ్రవాదులైన షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లాం (జమ్మూ కశ్మీర్‌), అద్నాన్‌ హసన్‌ (భత్కల్, కర్ణాటక), మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లను (ముంబ్రా, మహారాష్ట్ర) 2016 జనవరిలో దుబాయ్‌ నుంచి డిపోర్ట్‌ చేశారు. వీరి విచారణలోనే ఐసిస్‌ ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. 

రెండుసార్లు చిక్కిన ‘యూత్‌’...
చాంద్రాయణగుట్టలోని నసీబ్‌నగర్, గుల్షాన్‌ ఇక్బాల్‌ కాలనీ, హుమాయున్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన అబ్దుల్లా బాసిత్, ఒమర్‌ ఫారూఖ్, మాజ్‌ హసన్‌ 2015 డిసెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరాలని కుట్ర పన్నారు. దీనికోసం శ్రీనగర్‌ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ చేరుకొని పట్టుబడి జైలుకు వెళ్లారు. దీనికి ముందు 2014లోనూ ఈ త్రయంతో మరో ఇద్దరు కలిసి బంగ్లాదేశ్‌ మీదుగా సిరియా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కోల్‌కతా వెళ్లిన నలుగురిని పట్టుకొని వెనక్కు తీసుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్‌తో సరిపెట్టారు. ఈ నేపథ్యంలోనే బాసిత్, ఒమర్, మాజ్‌లు సుదీర్ఘకాలం ఆన్‌లైన్‌ ద్వారా సిరియాలోని ఐసిస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారు. ‘ఐసిస్‌ త్రయానికి’ రెండుసార్లూ ఆర్థిక సాయం చేసింది ఎవరో కాదు కర్ణాటకలోని భత్కల్‌ వాసి అద్నాన్‌ హసన్‌. 

ఉగ్ర నేతలతో టచ్‌లోకి ‘ఆమె’...  
రెండుసార్లు దేశం దాటే ప్రయత్నాలు చేసిన ఐసిస్‌ త్రయంతో సిరియా కేంద్రంగా షఫీ ఆర్మర్‌కు అత్యంత సన్నిహితంగా పని చేస్తున్న ఉగ్ర నేత అబు జకారియా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఈ ముగ్గురిలో ఒకరైన బాసిత్‌ సోదరి సనాతోనూ అతడికి పరిచయం ఏర్పడింది. బాసిత్‌ ఆమెనూ టర్కీ మీదుగా సిరియా తీసుకెళ్లాలని భావించా డు. ఐసిస్‌ ఉగ్రవాదులకు పెళ్లి సంబంధాలు కుదర్చడం కోసం జకారియా ప్రత్యేకంగా ‘జిహాదీ మ్యాట్రిమోని’ పేరుతో వెబ్‌సైట్‌ కూడా నిర్వహించాడు. వీరిద్దరి మధ్యా పరిచయం పెరగడంతో సనాను జకారియా వివాహం చేసుకోవాలని భావించాడు. సిరియా కేంద్రగానే పని చేస్తున్న మరో ఉగ్రవాద నేత అబు హంజా అల్‌ ముజాహిర్‌ సైతం తరచూ ‘ఐసిస్‌ త్రయం’తో సంప్రదింపులు జరిపేవాడు. ఇతడికీ సదరు యువతితో పరిచయం ఏర్పడింది. వివిధ రకాలైన సోషల్‌ మీడియాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా ఐసిస్‌ భావజాల వ్యాప్తి బాధ్యతల్ని ముజాహిర్‌ పర్యవేక్షిస్తున్నాడు. ఆమెను ఇష్టపడిన ముజాహిర్‌ సైతం వివాహానికి సిద్ధమయ్యాడు. ఇలా ఓపక్క జకారియా, మరోపక్క ముజాహిర్‌లు నగరానికి చెందిన బాసిత్‌ సోదరి సనాను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడంతో ఈ వ్యవహారం ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా మారింది. 

అరెస్టులతో ఆగిపాయె...
ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ మరో మలుపు తీసుకోకముందే బాసిత్, మాజ్, ఒమర్‌లు 2015లో నాగ్‌పూర్‌లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. అప్పట్లో సనాను సైతం అదుపులోకి తీసుకున్న అధికారులు కౌన్సెలింగ్‌ చేసి వదిలిపెట్టారు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదింపుల విషయం మాత్రమే బయటకు రావడంతో ఆ చర్యలు తీసుకున్నారు. బాసిత్‌... అద్నాన్‌తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. షఫీ ఆర్మర్‌ సూచనల మేరకు ఈ ముగ్గురికీ రెండుసార్లు దుబాయ్‌ నుంచి అద్నానే ఆర్థిక సహాయం చేశాడు. ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బగ్దాదీతో నేరుగా టచ్‌లో ఉన్న ఈ ముగ్గురినీ రెండుసార్లు షఫీ ఆర్మరే సిరియా రావాల్సిందిగా సూచించాడు. అద్నాన్‌ దుబాయ్‌లో చిక్కిన తర్వాత  డిపోర్టేషన్‌పై తీసుకొచ్చి విచారించిన ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్‌ ఈ ‘ఉగ్ర ప్రేమాయణాన్ని’ గుర్తించింది. ఎన్‌ఐఏ యూనిట్‌ సోమవారం మొత్తం ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. వీరిని కొన్ని రోజుల పాటు విచారించనుంది.

మరిన్ని వార్తలు