సిద్దూకు ఐటీ షాక్‌; బ్యాంక్‌ అకౌంట్లు సీజ్‌

30 Mar, 2018 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ షాకిచ్చింది. ట్యాక్స్‌ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా అతనికి సంబంధించిన రెండు బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేశారు. 2014-15 సంవత్సరంలో సిద్ధూ ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని, అదనంగా రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుందని గతేడాది జనవరిలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని అధికారులు గుర్తుచేశారు. అయితే సరదు నోటీసులపై సిద్దూ అప్పీలుకు వెళ్లారని, విచారణ చేపట్టిన కమిషనర్‌ చివరికి పన్ను కట్టాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశామని ఐటీ శాఖ గురువారం ఒక ప్రకటన చేసింది.

సిద్దూ పన్ను ఎగ్గొట్టింది వీటిపైనే..: ఐటీ శాఖ పేర్కొన్నట్లు మంత్రి సిద్దూ రూ.52 లక్షల పన్ను కట్టాల్సిఉంది. అవి ఏయే ఖర్చులకు సంబధిచినవో కూడా ప్రకటనలో పేర్కొన్నారు. 2014-15లో సిద్దూ దుస్తుల కోసం రూ.28.38లక్షలు, పర్యటన కోసం రూ38.24లక్షలు, జీతం వ్యయం రూ.47.11లక్షలు, పెట్రోల్‌,డీజిల్‌ కోసం రూ.17.80లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లులు లేదా ఇన్‌వాయిస్‌లను సమర్పించడంలో విఫలమయ్యారు. ఇక సిద్దూ బ్యాంక్‌ అకౌంట్ల సీజ్‌ వ్యవహారం ఇటు రాజకీయంగానూ ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లైంది. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను స్టార్‌ క్యాంపెయినర్‌గా పంపాలనుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. మాటలమాత్రికుడు సిద్ధూ అకౌంట్ల సీజ్‌పై స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు