‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌

7 Mar, 2019 03:33 IST|Sakshi

ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో ఏర్పాటు

ముగ్గురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు

డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ కేటాయింపు

ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సైబరాబాద్, హైదరాబాద్‌ రెండు కమిషనరేట్లలోనూ కేసులు నమోదైన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసింది. సభ్యుల్లోని 9 మంది గతంలో సైబర్‌ నేరాల విచారణలో రాణించిన నేపథ్యం ఉన్నవారే. అందుకే, కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేసేందుకు బృందంలోకి వీరిని తీసుకున్నట్లు తెలిసింది. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

కేసు నేపథ్యమిది
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్‌ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలోని ఐటీగ్రిడ్‌ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకుంది. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఎస్సార్‌ నగర్‌లోనూ ఇదే అంశంపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును స్వయంగా హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. కాగా కొత్తగా ఏర్పాటుచేసిన ఈ సిట్‌.. తక్షణమే మనుగడలోకి వచ్చేలా, దర్యాప్తు బాధ్యతలు చేపట్టేలా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు సమాచారమంతా సిట్‌కు బదిలీ కానుంది. గురువారం నుంచి ఈ ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. సిట్‌ కోసం డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని కూడా కేటాయించినట్లు సమాచారం. ఇక నుంచి ఈ కార్యాలయం కేంద్రంగానే దర్యాప్తు పర్యవేక్షణ సాగుతుంది. సిట్‌కు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లు, సీఐడీ విభాగాలు నిత్యం సహకరిస్తాయని ఆదేశాల్లో స్పష్టంచేశారు. (ఇదీ జరుగుతోంది!)

ఈ సిట్‌ బృందం వివరాలు
1. స్టీఫెన్‌ రవీంద్ర, ఐజీ వెస్ట్‌జోన్‌
2. ఎన్‌.శ్వేత, కామారెడ్డి ఎస్పీ  
3. రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్‌)
4. జి. శ్రీధర్, నారాయణ్‌పేట్‌ ఎస్‌డీపీవో  
5. బి.రవికుమార్‌రెడ్డి, సైబరాబాద్‌ డీఎస్పీ (సైబర్‌ క్రైమ్‌)  
6. ఎన్‌.శ్యామ్‌ ప్రసాద్‌ రావు, ఏసీపీ, మాదాపూర్‌
7. వై. శ్రీనివాస్, ఏసీపీ, సైబరాబాద్‌ (క్రైమ్‌)
8. బి.రమేశ్, ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్‌ (సీసీఎస్‌)
9. జి.వెంకటరామిరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ హైదరాబాద్‌ (సైబర్‌ క్రైమ్‌)

మరిన్ని వార్తలు