సినీ ప్రముఖులపై ఐటీ దాడులు 

17 Jan, 2018 15:18 IST|Sakshi

జైసింహా నిర్మాత సి.కల్యాణ్, అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ ఆఫీసుల్లో తనిఖీలు 

మరో నలుగురు ప్రముఖుల కార్యాలయాల్లోనూ సోదాలు 

సినిమాలకు పెట్టుబడులు, ఆదాయ వివరాలపై ఆరా  

సాక్షి, హైదరాబాద్‌: పలువురు సినీ ప్రముఖుల కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు బుధవారం దాడులు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన జైసింçహా చిత్ర నిర్మాత సి.కల్యాణ్, పవన్‌కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ అలియాస్‌ చిన్నబాబుతో పాటు మరో నలుగురు సినీ ప్రముఖుల కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తొలుత కృష్ణానగర్‌లోని సి.కల్యాణ్‌ కార్యాలయంలో ఆరుగురితో కూడిన ఐటీ అధికారుల బృందం దాడి చేసి.. ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఆయన నివాసంలోనూ సోదాలు చేసింది. జైసింహా చిత్రంతోపాటు త్వరలో వీవీ వినాయక్, సాయిధరమ్‌తేజ్‌ కాంబినేషన్‌లో తలపెట్టిన భారీ బడ్జెట్‌ సినిమాకు సంబంధించిన లెక్కలు, పెట్టుబడుల వివరాలను, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సేకరించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు