నిందితులను వదిలేది లేదు

12 Jun, 2020 13:16 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగలు, బైక్, నిందితులను చూపిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి తదితరులు

ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్‌

రూ.3.50 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి

జడ్చర్ల: హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జడ్చర్ల తదితర ప్రాంతాలను అడ్డాలుగా ఎంచుకొని అక్కడి నుంచి వచ్చి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టమని ఎస్పీ రెమారాజేశ్వరి హెచ్చరించారు. గురువారం జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7న మండలంలోని తంగెళ్లపల్లి, గంగాపూర్, కోడ్గల్‌లో అలివేలమ్మ, అలివేలు, సుజాత మెడల్లోంచి పుస్తెల తాళ్లను దొంగలు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్తారని బాధితులు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగతానికి పాల్పడిన పండిత్‌ సూరజ్‌కుమార్‌పాండే, పత్తెప్పరప్ప శ్రీనివాస్, షేక్‌ అఫ్రిద్‌ దొరికారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు తామే చేసినట్లు    ఒప్పుకున్నారు. వీరిలో పండిత్‌ సూరజ్‌కుమార్‌పాండేపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 18 కేసులు నమోదై ఉన్నాయని, పీడీయాక్టు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అంతేగాక షాద్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఇతడిపై మరోసారి పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో నివాసం ఉంటూ  ఫంక్షన్‌హాల్స్‌లో డెకరేషన్‌ పనులు చేసుకుంటూనే ఇలాంటి నేరాలు చేస్తుంటారని తెలిపారు. ఇక పతెపరప్ప శ్రీనివాస్‌ ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అన్నాసాగర్‌కు చెందినవాడని, ఇతను హైదరాబాద్‌ బాలాపూర్‌లో  ఉంటున్నాడని తెలిపారు. ఇతడిపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో బాలికను కిడ్నాప్‌ చేసిన సంఘటనకు సంబందించి పొక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదై ఉందన్నారు. షేక్‌ అఫ్రిద్‌ బాలాపూర్‌లో ఉంటుండగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందినవాడని తెలిపారు. వీరంతా జైలులో పరిచయమయ్యారని.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి నేరాలకు అలవాటు పడ్డారని, ఇతడిపై నాలుగు కేసులు బయట పడినట్లు వివరించారు. వీరి నుంచి మూడు పుస్తెల తాళ్లతో పాటు బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వారికి ఆశ్రయం కల్పించవద్దని ఎస్పీ సూచించారు. అనుమానం వస్తే వెంటనే 100కు డయల్‌ చేయాలని కోరారు. కేసులో పురోగతి సాధించిన జడ్చర్ల పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరస్వామి, ఎస్‌ఐలు శంషోద్దీన్, జయప్రసాద్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు