‘జగ్గారెడ్డి పారిపోయే అవకాశం లేదు’

11 Sep, 2018 16:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని సికిం‍ద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సికింద్రాబాద్‌లోని 18వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు ఆయనను హాజరు పరిచారు. 14 రోజులు జగ్గారెడ్డిని రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 25 వరకు ఆయన చంచల్‌గూడ జైలులో ఉండనున్నారు.

అయితే, జగ్గారెడ్డి అరెస్టును ఆయన న్యాయవాది దామోదర్‌ రెడ్డి తప్పుబట్టారు. 2007లో రషీద్‌ ఖాన్‌ ఇచ్చిన వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరు లేదని, 2007 నుంచి 2014 వరకు అనేక మంది ఎమ్మెల్యేలు పాస్‌పోర్ట్‌లు తీసుకున్నారని, జగ్గారెడ్డి కుటుంబసభ్యుల పేర్ల మీద నకిలీ పాస్‌పోర్ట్‌లు తీసుకుంటే.. ప్రభుత్వ అధికారులను కూడా ప్రాసిక్యూట్‌ చేయాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ బొండా మార్కెట్‌ పోలీసులు  సుమోటోగా కేసు రిజిస్టర్‌ చేశారని, ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని, జగ్గారెడ్డి అరెస్ట్‌ పూర్తిగా న్యాయసూత్రాలకు విరుద్దమని అన్నారు. 

అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా.. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ నేతలు బంద్‌ను ప్రకటించారు. ఈ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మాజీమంత్రి సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నర్సాపూర్‌లో ధర్నా చేస్తుండగా.. అరెస్టు చేసి పుల్కల్ మండలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు..

అరెస్ట్‌లో భాగంగా పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌ 370 సరికాదంటూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని జగ్గారెడ్డి తరపు న్యాయవాది దామోదర్‌ రెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. 2004లో సంఘటన జరిగితే... ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని.. విశ్వసనీయ సమాచారమంటున్నారని.. సమాచారం ఎవరిచ్చారో రిమాండ్‌ రిపోర్ట్‌లో కూడా తెలుపలేదని ఆయన అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారని, ప్రస్తుతం రాజకీయ నేతగా కొనసాగుతున్నారని.. జగ్గారెడ్డి పారిపోయే అవకాశం లేదని.. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తాడని.. బెయిల్‌ మంజూరు చేయవలిసిందిగా న్యాయస్థానాన్ని కోరారు.

జగ్గారెడ్డి 15 లక్షలు తీసుకున్నారు: డీసీపీ సుమతి

మరిన్ని వార్తలు