బ్యాంక్‌ మేనేజర్‌కు జైలు

1 Sep, 2018 02:04 IST|Sakshi

మరొకరికి కఠిన కారాగారం..సీబీఐ కోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకును మోసగించిన కేసులో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని విజయా బ్యాంకు మేనేజర్‌ కె.దేవేందర్‌రావు, మరోవ్యక్తి ఎం.వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ ఫోర్జరీ సంతకాలు, బోగస్‌ పత్రాల ఆధారంగా 12 మందికి ఇళ్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల నిమిత్తం ఇచ్చిన బ్యాంక్‌ డ్రాఫ్ట్‌లను నగదుగా మార్పు చేసి రుణాలు పొందిన వారికి ఆ మొత్తాలను అందజేయడంలో వెంకటేశ్వరరావు సహకరించారు.

ఫలితంగా బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వచ్చిందంటూ 2006 జనవరి 4న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ కోర్టు బ్యాంక్‌ మేనేజర్‌ దేవేందర్‌రావు, వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగారం తోపాటుగా వీరిద్దరికీ వరుసగా రూ.3 లక్షలు, రూ.1.5లక్షల జరిమానాను విధించింది. అది చెల్లించకపోతే 6 నెలలు సాధారణ జైలు  గడపాలని  పేర్కొంటూ;  17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు