వైరా చిట్‌ఫండ్‌ మోసగాళ్లకు జైలుశిక్ష

8 Aug, 2018 11:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపుగా 400మంది నుంచి చిట్టీల రూపంలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి, టోపీ పెట్టిన కేసులో  వైరాలోని సాయిప్రసన్న చిట్‌ఫండ్‌ నిర్వాహకులు ముగ్గురికి జైలు శిక్ష, భారీగా జరిమానా పడింది. ఈ మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌  మంగళవారం తీర్పుచెప్పారు. 

ఖమ్మంలీగల్‌ : దొండిగర్ల బాలశౌరి, అతని కుటుంబీకులు కలిసి వైరాలో సాయి ప్రసన్న చిట్‌ఫండ్‌ పేరుతో 1996లో వ్యాపారం ప్రారంభించారు. సుమారు పదేళ్లపాటు సాగించారు. చందాదారులకు నమ్మకం కలిగించారు. ఈ చందాదారుల్లో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. చిట్టీ డబ్బుల కింద వీరిలో అనేకమందికి చిట్‌ఫండ్‌ నిర్వాహకులు చెక్కులు ఇచ్చారు. అవి చెల్లలేదు. చందాదారులు ఒత్తిడి చేయడంతో.. ‘‘నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. మీ డబ్బుకు ఎటువంటి ఢోకా లేదు’’ అంటూ అందరినీ బాలశౌరి నమ్మించాడు.

∙2010, డిసెంబర్‌ 16న ఇతడి కుటుంబం మొత్తం వైరాలోని ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత, వైరాలోని పెద్దలు పంచాయితీ పెట్టారు. వైరాలోగల ఆస్తులను అమ్మి, ఎవరి డబ్బు వారికి ఇస్తామని బాలశౌరి, ఆయన పెద్ద కుమారుడు వరప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఇదంతా 2011 వరకు సాగింది. చెప్పిన ప్రకారంగా బాలశౌరి, ఆయన కుమారుడు.. బాధితులకు డబ్బు ఇవ్వలేదు. దీంతో దాదాపుగా 400 బాధితుల తరఫున కలిసి వైరా పోలీసులకు రాయల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. కోర్టులో చార్జిషీటును పోలీసులు  దాఖలు చేశారు. మొత్తం 49మంది సాక్షులుగా చూపించారు. ఈ కేసులో తీర్పును మంగళవారం న్యాయమూర్తి వెలువరించారు. నేరం రుజువైందని నిర్థారించారు. 

బాలశౌరికి ఐపీసీ 406 సెక్షన్‌ కింద మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25లక్షల జరిమానా, 420 ఐపీసీ కింద ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా, సెక్షన్‌ 5 ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ 1999 కింద ఏడేళ్ల జైలుశిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించారు. మరో నిందితురాలు దొడ్డిగర్ల శాంతకు ఐపీసీ 406 సెక్షన్‌ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్‌ 5 ఏపీపీ డీఎఫ్‌ఈ యాక్ట్‌ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. 

నాలుగో నిందితుడైన దొడ్డిగొర్ల ప్రసన్నకుమార్‌కు ఐపీసీ 406 సెక్షన్‌ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.12లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్‌ 5 ఏపీపీ డీఎఫ్‌ఈ యాక్ట్‌ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. మూడవ నిందితుడైన దొడ్డిగర్ల వరప్రసాద్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు.  ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఆర్‌.ఉపేందర్‌ వ్యవహరించారు. లైజన్‌ ఆఫీసర్‌ పి.భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్‌ కె.చెన్నారావు, హోంగార్డ్‌ ఎస్‌డి.యూసుఫ్‌ సహకరించారు. 

మరిన్ని వార్తలు