జనగామ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి మృతి

12 Jul, 2018 14:54 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి (ఫైల్‌) 

జనగామ/పాలకుర్తి: జనగామ మాజీ ఎమ్మెల్యే కోడూరు వరదారెడ్డి(82) హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరదారెడ్డిని మెరుగైన వైద్య పరీక్షలను అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించగా కన్నుమూశారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన వరదారెడ్డి చిన్న నాటి నుంచే ప్రజా సంబంధాలు కలిగి ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.

కాంగ్రెస్‌లో కీలక నేతగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. 1958 నుంచి 1970 వరకు ఈరవెన్ను సర్పంచ్‌గా, 1970 నుంచి 1975 వరకు కొడకండ్ల సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలో అప్పటికే మంచి పేరున్న వరదారెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది.

1978 నుంచి 1983 వరకు జనగామ ఎమ్మెల్యేగా పని చేశారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందారు. కరువుకు కేరాఫ్‌గా ఉన్న జనగామ ప్రాంతాన్ని మరో కోనసీమలా మార్చేందుకు  వరదారెడ్డి పోచంపాడు ఎత్తిపోతల పథకం కోసం జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేశారు.

ఆ సమయంలోనే 1984లో ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మడంలం నిడిగొండ గ్రామంలో బహిరంగసభ నిర్వహించి నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆహ్వానించారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోచంపాడు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని ఇందిర ప్రకటించడంతో ఆయన కృషి ఫలించినట్లయ్యింది. దీంతోపాటు రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర చాలా కీలకం. పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఆయన వీరోచిత గాథలను నేటికీ చెప్పుకుంటారు. 

తెలంగాణ ఏర్పాటుతోనే ప్రజల సమస్యలు తీరుతాయని భావించి 2001లో కేసిఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ స్థాపనకు కృషి చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఆవరణలో చేతి వేలు కోసుకుని ఉద్యమానికి ఊతమిచ్చారు. ఆ తర్వాత∙టీఆర్‌ఎస్‌ను వీడి రైతు నాయకుడిగానే ప్రజల పక్షాన గొంతు వినిపించారు. రైతు కుటుంబ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన కుటుంబానికి 200 ఎకరాల భూమి ఉండేది.

కాలక్రమంలో 50 ఎకరాలకు మిగిలింది. ఇద్దరు కుమారులకు పంచి,  10 ఎకరాలు తీసుకుని సేద్యం చేశారు. వరదారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. జనగామ జిల్లా జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి ఆయనకు స్వయాన అల్లుడు. వరదారెడ్డి మృతితో కుటుంబ సభ్యులతో పాలకుర్తి, ఈరవెన్ను గ్రామాలతోపాటు జిల్లా వాసులు విషాదంలో మునిగి పోయారు. గురువారం ఈరవెన్నులో వరదారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టీపీసీసీ, మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య..వరదారెడ్డి మృతదేహాన్ని యశో ద హాస్పిటల్‌లో సందర్శించి నివాళులర్పించారు.

మరిచిపోలేని నేత: మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌.రాజారెడ్డి

రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రాజారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సీపీఐ కార్యాలయంలో వరదారెడ్డి చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో జిల్లా సమితి సహాయ కార్యదర్శి బర్ల శ్రీరాములు, ఆకుల శ్రీనివాస్, సోమయ్య, జనార్దన్, సత్యం, వైకుంఠం, సుగుణమ్మ ఉన్నారు. అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా