డీఎస్పీ చొరవతో సద్దుమణిగిన టిక్కెట్ల లొల్లి

10 Jan, 2018 11:10 IST|Sakshi
అభిమాన సంఘ నేతలతో మాట్లాడుతున్న డీఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): అభిమానుల మధ్య తలెత్తిన టిక్కెట్ల వివాదం డీఎస్పీ చొరవతో సద్దుమణిగింది. పవన్‌కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదల నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే థియేటర్‌ యాజమాన్యాలు, అభిమాన సంఘ నాయకులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి డీఎస్పీ తన కార్యాలయంలో థియేటర్‌ యాజమాన్యాలు, చిరంజీవి యువత, జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.  వేల సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడం కుదరదని డీఎస్పీ తేల్చిచెప్పారు.

దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. మంగళవారం చిరంజీవి యువత నాయకులు మెగా బ్రదర్‌ నాగబాబు, ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో  పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించారు. మరోమారు డీఎస్పీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఉన్న థియేటర్లు, వాటి సీటింగ్‌ సామర్థ్యాలను డీఎస్పీ అడిగి తెలుసుకొన్నారు. సగం టిక్కె ట్లు అభిమాన సంఘాలకు ఇవ్వాలని, మిగిలిన టిక్కెట్లు థియేటర్‌లో క్యూలో, ఆన్‌లైన్‌లో విక్రయించాలని సూచించారు. తొలి మూడు షోలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు