పోలీసుల అదుపులో జనశక్తి నక్సల్స్‌?

6 Jul, 2020 11:24 IST|Sakshi

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమం కనుమరుగు కాగా కొత్తగా జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద ఓ కంట్రిమెడ్‌ తుపాకీతో పాటు రివాల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తంగళ్లపల్లి మండలం జిల్లె్లల్ల కు చెందిన ఒకరిని, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, జనశక్తి పేరుతో సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో నక్సలైట్ల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారని సమాచారం. నక్సలైట్ల పేరుతో వ్యాపారులకు చిట్టీలు రాసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్‌ వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిరిసిల్ల పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

మాజీలతో లింక్‌..
జిల్లాలో 2006 తర్వాత నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ న క్సలైట్లతో కలిసి పలువురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఆయుధాలతో బెదిరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పలు వురు వ్యాపారులకు చిట్టీలు రాస్తున్న క్రమంలో ఆ నలుగురు పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. వారి వద్ద రెండు ఆయుధాలు లభించినట్లు సమాచారం. జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగకుండానే పోలీసులు అప్రమత్తంగా ఉండి అసాంఘిక శక్తులను కట్టడి చేయడం విశేషం.

మరిన్ని వార్తలు