జన్మభూమి కమిటీ సభ్యుడు ఆత్మహత్య

7 Feb, 2018 13:19 IST|Sakshi
జీడి తోటలో ఉన్న మృతదేహం, పాపారావు (ఫైల్‌)

శ్రీకాకుళం, నరసన్నపేట: గోపాలపెంట జన్మభూమి కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త చిట్టి పాపారావు(40) ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి పాపారావు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మినర్సమ్మ, భార్య లక్ష్మి ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం నుంచి బంధువులను వాకాబు చేశారు. ఫోను కూడా పనిచేయక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామ శివార్లలో జీడి తోటల్లో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు.

పాపారావు హత్యకు గురయ్యాడని ముందుగా వదంతులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ నారాయణస్వామి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాపారావు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉండటం, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతుడి వద్ద ఉత్తరం ఉండటంతో పోలీసులు వాటి ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెలుగు అధికారుల తీరుపై ఆరోపణలు
కాగా గోపాలపెంట ఇసుక ర్యాంపు నిర్వహణ సందర్భంగా వెలుగు ఏసీ రవి, ఏపీఎం గోవిందరాజులు తనతో అనేక తప్పులు చేయించారని, దీంతో గ్రామంలో మాట పడ్డానని, ఏసీ, ఏపీఎంను మాత్రం క్షమించకూడదని పాపారావు సూసైడ్‌ నోట్‌లో పొందుపరిచాడు. ఆ తప్పులు ఏమిటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.  కాగా పాపారావు మృతితో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు