జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...

14 Feb, 2019 11:23 IST|Sakshi

పక్కా ప్లాన్‌తో జయరామ్‌ను ట్రాప్ చేసిన రాకేష్‌ రెడ్డి

జయరామ్‌కు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వని నిందితుడు

బెదిరించి డబ్బు వసూలు చేయాలని స్కెచ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను  కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఇప్పటివరకూ ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్‌ రెడ్డి  ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. 

బెదిరింపులతో జయరామ్‌ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన‍్న పథకంతోనే అతడిని రాకేష్‌ రెడ్డి ట్రాప్‌ చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నిందితుడు రంగంలోకి దింపి, వాళ్లు తనకు అప్పుగా డబ్బు ఇచ్చినట్లు రాకేష్‌ రెడ్డి సాక్ష్యాలు సృష్టించాడు. అంతేకాకుండా జయరామ్‌ హత్యకు కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సహరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చింతల్ రౌడీ షీటర్‌తో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులను వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటలపాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే రాకేష్‌ సంచరించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడు 11మంది పోలీస్‌ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం వారితో అతడు ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడి కాగా, వారిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. దీంతో పోలీస్‌ అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు నిన్న ఆమెను బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి పిలిపించి, మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి  విచారించారు.

మరిన్ని వార్తలు