జయరాం హత్య కేసులో శిఖా చౌదరి నిర్దోషి..

14 Mar, 2019 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో అరెస్ట్‌ అయిన ముగ్గురుని జూబ్లీహిల్స్‌ పోలీసులు  గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ జయరాం హత్యకేసులో వీరి పాత్ర గురించి వివరించారు. జయరామ్‌ను హత్య చేసిన అనంతరం టీడీపీ మంత్రులకు రాకేష్‌ రెడ్డి ఫోన్‌ చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అయితే వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రాకేష్‌ రెడ్డి ఫోన్‌ కాల్స్‌ను పరిశీలిస్తామని.. మరో 15 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేస్తామన్నారు.  కాగా మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.
(ఏపీకి చెందిన ఎవరా మంత్రి!?)
చీటింగ్‌ కింద కేసు నమోదు
‘జయరామ్‌ హత్యకేసులో సూర్య, కిషోర్‌, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించారు. కిషోర్‌ అనే వ్యక్తి హానీ ట్రాప్‌ చేసి జయరాంను రాకేష్‌ రెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరామ్‌ను తీసుకరావాలని సూర్య, కిషోర్‌లకి రాకేష్‌ రెడ్డి ఆదేశించాడు. దీంతో జయరాంను రాకేష్‌ రెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు. వీరిపై చీటింగ్‌ కేసు నమోదు చేశాము. హత్య విషయం ముందే తెలిసినా పోలీసులకు అంజిరెడ్డి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా రాకేష్‌ రెడ్డి జయరాం వద్ద బలవంతంగా సంతకాలు తీసుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లాడు. శిఖా చౌదరికీ ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధంలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులకి రాకేష్‌ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, రాజకీయం నాయకుల పేర్లు చెప్పి అందరినీ బయపెట్టడం రాకేష్‌ రెడ్డికి అలవాటు’అంటూ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
(జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్)   
మమ్మల్ని వాడుకొని మోసం చేశాడు
జయరాం హత్యకేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య గురువారం మీడియాకు తెలిపారు. కిషోర్‌తో తనకు ఐదేళ్ల నుంచి మంచి స్నేహితుడని, తాను చెప్పడం వల్లే కిషోర్‌ తనతో రాకేష్‌ రెడ్డి ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అంతకముందు రాకేష్‌ రెడ్డిని ఐదు సార్లు కలిశానన్నారు. తమను వాడుకొని రాకేష్‌ రెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు