-

కీలక విషయాలు వెల్లడించిన రాకేశ్‌రెడ్డి

13 Feb, 2019 19:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసు విచారణను హైదరాబాద్‌ పోలీసులు వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. డబ్బుల కోసమే జయరామ్‌ను ఇంటికి పిలిచి నిర్భంధించినట్టు రాకేశ్‌ పోలీసులకు తెలిపాడు. జయరామ్‌ను వేధిస్తే డబ్బులు వసూలు అవుతాయని భావించి.. అందరికీ ఫోన్‌ కాల్స్‌ చేపించానని చెప్పాడు. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు జయరామ్‌ను కొట్టడంతో.. అతను మృతి చెందినట్టు ఒప్పుకున్నాడు.

హత్య చేసిన తర్వాత జయరామ్‌ మృతదేహాన్ని కారులో ఉంచుకుని హైదరాబాద్‌లో తిరిగానని తెలిపాడు. హత్య జరిగిన తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు మాట్లాడినట్టు.. అదే రోజు నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు 13 సార్లు ఫోన్‌ చేసినట్టు పేర్కొన్నాడు. బీర్‌ బాటిల్స్‌ కోని దాన్ని జయరామ్‌ ఒంటిపై, మూతిపై పోసి.. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నట్టు చెప్పాడు.
 

మరిన్ని వార్తలు