జయరామ్‌ కేసు: విచారణకు హాజరైన పోలీసులు

20 Feb, 2019 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌  : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్‌ అధికారులు బుధవారం విచారణకు హాజరు అయ్యారు.  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌ ఇవాళ విచారణకు వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి ...జయరామ్‌ హత్యకు ముందు, అనంతరం పోలీస్‌ అధికారులతో ఫోన్లలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఓ పోలీస్‌ అధికారి నిందితుడికి సలహా ఇవ్వడంపై విచారణ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. మొదట జయరామ్‌ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో రాకేష్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్లోనే సెటిల్‌ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే హత్య చేశాడు. మరోవైపు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. (స్టేషన్లోనే సెటిల్‌ చేద్దామనుకుని!)

రాకేష్‌ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ శ్రీనివాస్‌
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ శ్రీనివాస్‌... రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు అంగీకరించారు. అయితే జయరామ్‌ హత్య విషయం తనతో చెప్పలేదని అన్నారు. గతంలో ఉన్న పరిచయంతోనే రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చాడని, అయితే తాను తర్వాత మాట్లాడతానని చెప్పడంతో వెళ్లిపోయినట్లు సీఐ తెలిపారు. ఆ తర్వాత తనతో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు