పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి

21 Jun, 2020 04:27 IST|Sakshi
పోలీసు కస్టడీ నిమిత్తం కడప కేంద్ర కారాగారం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డిని కారులో తరలిస్తున్న దృశ్యం

కడప అర్బన్‌/కోటిరెడ్డి సర్కిల్‌/సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం జిల్లా పోలీసులు రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కోర్టు ఈ నెల 20 మధ్యాహ్నం 1 గంట నుంచి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనంతపురం పోలీసులు శనివారం కడప కేంద్ర కారాగారం నుంచి జేసీని, ఆయన తనయుడిని తమ వాహనాల్లో తీసుకెళ్లారు. 

కేసును కొట్టేయాలంటూ పిటిషన్‌
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి జేసీ ఉమ, అస్మిత్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు