అక్క కోసం ‘చెల్లి’ంచింది!

25 May, 2020 03:58 IST|Sakshi
కొనుగోలు చేసిన శిశువు

నాలుగుసార్లు అబార్షనైన సోదరి కోసం మగ శిశువు కొనుగోలు

రూ.22 వేలకు కొని తీసుకెళుతుండగా పట్టుకున్న పోలీసులు

మధ్యవర్తులతో సహా ఆరుగురిపై కేసు నమోదు 

జీడిమెట్ల: అక్కకు నాలుగుసార్లు అబార్షన్‌ అయి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధకు చలించిన ఓ చెల్లి రాష్ట్ర ప్రభుత్వ దత్తత నియమాలు అనుసరించకుండా రూ.22 వేలకు మగ శిశువును కొన్న వ్యవహారం జీడిమెట్ల ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఇద్దరితో పాటు మధ్యవర్తులు ఇద్దరిపై, మగ శిశువును అమ్మిన తల్లిదండ్రులపై జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌లోని 80, 81 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...

మహబూబాబాద్‌ జిల్లా కాచీపుట్లకు చెందిన దంపతులు మదన్‌సింగ్, సరిత 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (6 ఏళ్లు, 2 నెలలు). అడ్డా కూలి అయిన మదన్‌సింగ్‌ మద్యానికి అలవాటుపడ్డాడు. లాక్‌డౌన్‌ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయితే ఇదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉండే మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితిని ఎల్లమ్మబండలో ఉంటున్న శేషు అనే మహిళకు వివరించారు. అంతకుముందే శేషు తన అక్క దేవీ పెంచుకునేందుకు ఓ బాబు కావాలని.. ఎవరన్నా ఉంటే చెప్పమని.. వీరికి చెప్పింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చిన శేషు... మదన్‌ సింగ్‌ దంపతులకు కూడా రూ.22 వేలు చెల్లించింది. అలాగే దత్తత తీసుకున్నట్లు బాండ్‌ పేపర్‌ రాయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారికి 2 నెలల బాబును ఇచ్చిన సరిత.. ఆదివారం ఉదయం ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు.

దీంతో ఆమె జరిగిన విషయమంతా చెప్పడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ బాబును తీసుకొని వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటకు శేషు, అరవింద్‌ (శేషు అన్న కొడుకు) వాహనంలో వెళుతుండగా బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌ మధ్యలో జీడిమెట్ల పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన అక్కకు నాలుగుసార్లు అబార్షన్‌ అయిందని, పిల్లలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో కొనుక్కొని తీసుకెళుతున్నామని చెప్పింది. ఆ తర్వాత మదన్‌సింగ్, సరితను కూడా జీడిమెట్ల ఠాణాకు తీసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నారని, ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని, అలాగే బాబును అమ్మారని... ఇలా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్‌కు తరలించారు. అయితే బాబును అమ్మేందుకు మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఇటువంటి ఉదంతాలపై కఠినంగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం చైర్మన్‌ అచ్యుతారావు.. బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డిని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు