మాటలతో ఏమార్చి.. నగలతో ఉడాయించారు

7 Mar, 2018 11:20 IST|Sakshi

ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 25 తులాల బంగారు

ఆభరణాలు దోచుకెళ్లిన వైనం

పోలీసు స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు

రాయచోటిటౌన్‌: అమ్మా ఇదిగో ఈ చిల్లర నీదేనా అంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి ఆమె బ్యాగులోని బంగారు ఆభరణాలున్న పర్సును దోచుకెళ్లిన సంఘటన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకొంది. బాధితురాలు కొండూరు ఆషాబీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మాసాపేటకు చెందిన ఆషాబీ కడపలో తన కుమార్తెకు వివాహం చేసింది. ఆమెకు సంబంధించిన 25 తులాల బంగారు ఆభరణాలు మొత్తం తన వద్దనే ఉండేవి. త్వరలో తన కుమార్తె ఇంటిలో శుభకార్యం జరగనుండటంతో వాటిని కుమార్తెకు ఇచ్చేందుకు మంగళవారం  రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీగా ఉండటంతో ఒక వ్యక్తి తన సీట్‌లో పక్కకు జరిగి కూర్చునేందుకు స్థలమిచ్చాడు.

తాన టీచర్‌నని చెప్పి నమ్మించాడు. ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి నిల్చుంది. కండక్టర్‌ వచ్చి టిక్కెట్‌లు తీసుకొనే క్రమంలో ఆషాబీ కాళ్ల కింద చిల్లర పడేసి అమ్మా ఈ చిల్లర డబ్బులు నీవేనా.. అంటూ చెప్పాడు. ఆమె కిందకు వంగి చిల్లర ఏరుకొనే క్రమంలో ఆమె బ్యాగ్‌లోని పర్సు దొంగిలించాడు. బస్సు సాయి థియేటర్‌ వద్దకు వెళ్లగానే ఈ బస్సు గాలివీడుకు వెళుతుందా అని వారు కండక్టర్‌ను అడిగారు. వెళ్లదని కండక్టర్‌ చెప్పడంతో వారు ఇద్దరు అక్కడే బస్సు దిగేశారు. బస్సు రింగ్‌ రోడ్డు వద్దకు వెళ్లిన తర్వాత  ఆషాబీ తన బ్యాగ్‌ను పరిశీలించి చూసుకోగా అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో లబోదిబో మంటూ ఏడుస్తూ బస్సు దిగి ఇంటికెళ్లింది. బంధువులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు