కశ్మీర్‌; ఇంటి ముందే మహిళా పోలీసు హత్య

16 Mar, 2019 17:48 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తన నివాసం ముందే మహిళా పోలీసు ఆఫీసర్‌ను కాల్చి చంపారు. కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలోని వెహ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల... దక్షిణ శ్రీనగర్‌లో స్పెషల్‌ పోలీసు ఆఫీసర్‌గా ఖుష్బూ జాన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కొంతమంది ఉగ్రవాదులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం ఖుష్బూపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

ఈ క్రమంలో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని, కానీ అప్పటికే ఖుష్బూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. హేయమైన ఈ చర్చను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఖుష్బూ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ భద్రతా బలగాలు ఘటనాస్థలిని అదుపులోకి తీసుకుని.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి, పోలీసులకు సానుభూతి తెలిపారు.

కాగా ఉగ్రవాదులను ఏరిపారేయడానికి కశ్మీర్‌ పోలీసులు నెలవారీ జీతం ఇచ్చి కొంత మందిని స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అయితే వారికి సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆయుధాలు సరఫరా చేయకుండానే పని చేయాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల అనంతరం కశ్మీర్‌లో ఉద్రి​క్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు