జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థ్ధి ఆత్మహత్యాయత్నం

26 Oct, 2018 09:42 IST|Sakshi
పోలీసుల అదుపులో విద్యార్థి రషీద్‌

డిటైన్డ్‌ విధానంతో నష్టపోతున్నామని ఆవేదన....

అడ్డుకున్న పోలీసులు, కేసునమోదు....

కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్‌టీయూహెచ్‌ అనుసరిస్తున్న డిటైన్డ్‌ విధానంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ  ఓ విద్యార్థి బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేందుకు యత్నించిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని స్పూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న రషీద్‌ అనే విద్యార్థి గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని నిర్మాణంలో ఉన్న మధుకాన్‌ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కిన అతను తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు.

దీంతో అక్కడికి చేరుకున్న భవనంపైకి ఎక్కి అతన్ని మాటల్లో పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రషీద్‌ మాట్లాడుతూ మూడు నెలలుగా డిటైన్డ్‌ విధానం ఎత్తివేయాలని ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నాడు. మూడు నెలలుగా పస్తులుంటూ అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా తమకు మాత్రం న్యాయం చేయడంలేదని ఆరోపించాడు. జేఎన్‌టీయూహెచ్‌ విధానాల్లో లోపాలు ఉన్న పట్టించుకోకండా కేవలం విద్యార్థులను క్రెడిట్స్‌ తక్కువ వచ్చాయని డిటైన్డ్‌ చేస్తుస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రషీద్‌ను స్టేషన్‌కు తరలించి కేసునమోదు చేశారు. 

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా.....
డిటెన్షన్‌ విధానంపై జేఎన్‌టీయూహెచ్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ  ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన డిటైన్ట్‌ విద్యార్ధులు ఆందోళనలో పాల్గొని యూనివర్శిటీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారితో రిజిస్ట్రార్‌ యాదయ్యను కలిసి వినతిపత్రం ఇప్పించారు. అయితే అధికారులు క్రేడిట్స్‌ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయికిరణ్, సంతోష్‌లతో పాటు పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు