ఆశారాం బాపూ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

23 Sep, 2019 15:26 IST|Sakshi

జోధ్‌పుర్‌: మైనర్‌ బాలికపై లైంగికదాడి కేసులో విధించిన జీవితఖైదును సవాలు చేస్తూ.. ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పుర్‌ హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధిత బాలిక మేజర్‌ అని, పోస్కో చట్టం నిబంధనల ప్రకారం ఆశారామ్‌కు శిక్ష వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు శిరీష్‌ గుప్తే, ప్రదీప్‌ చౌదరి వాదించారు. జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ వినీత్‌ కుమార్‌ మాధుర్‌లతో కూడిన స్పెషల్‌ బెంచ్‌ వీరి వాదనను తోసిపుచ్చింది. నేరం జరిగిన సమయంలో బాలిక మైనర్‌ అని ట్రయల్‌ కోర్టులో అభియోగాలు రుజువైన విషయాన్ని ప్రస్తావించింది. 

కాగా తన ఆశ్రమంలో చదువుతున్న మైనర్‌ బాలికను జోధ్‌పూర్‌కు దగ్గరలోని మనాయ్‌ గ్రామంలో 2013 ఆగస్ట్‌లో అత్యాచారం చేశానని ఆశారాం అంగీకరించారు.  గత ఏడాది ఏప్రిల్‌ నెలలో జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపూకు జీవితఖైదు విధించింది. తనను తాను దైవదూతగా చెప్పుకునే ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి 20 సంవత్సరాల చొప్పున శిక్షను కోర్టు విధించింది.

మరిన్ని వార్తలు