మీడియా పేరుతో బెదిరింపులు

22 Feb, 2018 09:45 IST|Sakshi

రూ.20లక్షలు డిమాండ్‌

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

విజయవాడ: జర్నలిస్టు అసోసియేషన్‌ నేత, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధి(సాక్షి టీవీ  కాదు)  ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఓ సివిల్‌ వివాదానికి సంబంధించి ఆ చానల్‌ ప్రతినిధి   రూ.20లక్షలు డిమాండ్‌ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. కార్పొరేట్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కమిషనరేట్‌లో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుపై విచారణకు ఏసీపీ స్థాయి అధికారిని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న జర్నలిస్టు అసోసియేషన్‌ నేత జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించాడు. ఆయన ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులను పిలిచి మాట్లాడారు.  మంత్రి జోక్యం చేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతానికి కేసు నమోదు చేయకుండా ఇరుపక్షాలతో రాజీ చర్చలు జరుపుతున్నారు. ఇటీవల హనుమాన్‌జంక్షన్‌ వద్ద కొందరు గ్రామీణ జర్నలిస్టులు బెదిరింపులకు పాల్పడితే పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.  విజయవాడలో ఓ జర్నలిస్టు నేత దందాపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విలేకరిపై పోలీసులకు ఫిర్యాదు
జగ్గయ్యపేటఅర్బన్‌(జగ్గయ్యపేట): సింగిల్‌ సిటింగ్‌తో ఉన్నత చదువులకు సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని స్థానిక సన్‌ప్లవర్‌ విలేకరి వల్లాపురం వెంకన్న         బాబుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈమేరకు బుధవారం వత్సవాయి మండలం, దేచుపాలేనికి చెందిన అన్నెపాక రాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. వివరాలు.. రెండేళ్ల నుంచి ఒక ప్రైవేటు సంస్థ పేరుతో సింగిల్‌ సిట్టింగ్‌తో ఇంటర్, డిగ్రీలకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసి తమ వంటి యువత నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ కోసం రూ.40 వేలు చెల్లించి 20 నెలలు అవుతున్నా సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. తనతో పాటు మరొక విద్యార్థిని మాధవి వద్ద నుంచి ఇలాగే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్‌ ఇవ్వటం లేదని ఫిర్యాదులో తెలిపింది.

మరిన్ని వార్తలు